ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల మూసివేత దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో డిగ్రీ ఎయిడెడ్ కళాశాలల నుంచి అధ్యాపకులను ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లోకి తీసుకున్నారు. అర్హత కల్గినవారిని విశ్వవిద్యాలయాలకు పంపించేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ ఉపాధ్యాయులను వెనక్కి ఇచ్చేందుకు ఇప్పటికే కొన్ని యాజమాన్యాలు సమ్మతి లేఖలు సమర్పించాయి.
ఉపాధ్యాయులు, అధ్యాపకులు కలిపి మొత్తం 8వేల573 మంది ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలోకి వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 2వేల సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రకటన విడుదల చేస్తామని జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించింది. అయితే.. ఎయిడెడ్ అధ్యాపకులను వర్సిటీల్లో నియమిస్తే జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో పదవీ విరమణతో ఖాళీలు ఏర్పడితే తప్ప కొత్త నియామకాలు చేపట్టే పరిస్థితి లేదు.
సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు మిగిలిపోయే ప్రమాదం
రాష్ట్రంలో 19వందల72 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా.. వీటిల్లో 6,982 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఎయిడెడ్ సిబ్బంది విలీనంతో విద్యాశాఖలో 7వేల ఖాళీలు భర్తీ కానున్నాయి. దీంతోపాటు నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం.. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు అనుసంధానం చేయడంతో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు మిగిలిపోయే ప్రమాదముంది. వీరికి పదోన్నతులు కల్పించడం వల్ల స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు కొంతవరకు భర్తీ అవుతాయి. ఇప్పుడు ఎయిడెడ్ సిబ్బంది రావడంతో దాదాపు ఖాళీలన్నీ భర్తీ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగితే, ఇప్పుడున్న ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేస్తే తప్ప కొత్తగా డీఎస్సీ ప్రకటన ఉండకపోవచ్చని విద్యావేత్తలు తెలిపారు.
ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై స్పష్టత వస్తే ఉపాధ్యాయుల నుంచి.. పదోన్నతులపై లెక్చరర్లుగా మరికొంత మంది వస్తారు. ఇవి కాకుండా అర్హత కలిగిన ఇంటర్మీడియట్‌లోని బోధనేతర సిబ్బందితో 10శాతం లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి కమిషనర్ వివరాలు కోరారు. ఈ విధానంలో వందకుపైగా ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు