బూతులు తిట్టడంలో ఆరితేరిన మంత్రులకు రైతులను పరామర్శించేందుకు మాత్రం నోరు పెగలటం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేఖ రాసిన ఆయన... ఆగస్టు నుంచి అక్టోబరు వరకు వచ్చిన వరుస విపత్తుల వల్ల 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినటంతో పాటు 9,720 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని.., దెబ్బతిన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్ట పరిహారాన్ని త్వరితగతిన అందజేయాలన్నారు. నివర్ తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసిందన్న అచ్చెన్న.., పంటలు కోతకు వచ్చే సమయంలో అన్నదాతలను నిలువునా ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినటంతో పాటు వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, చెరకు, కంది, చిరుధాన్యాల పంటలు నీట మునిగాయన్నారు.
నివర్ తుపాను కారణంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కోసం తక్షణం 5 వేల కోట్లు అవసరమని తెలిపారు. అక్టోబరులో కురిసిన వర్షాలకు గోదావరి జిల్లాల్లో ముంపు ప్రభావం ఎక్కువ ఉంటే... అమరావతి మునిగిందా లేదా అని గాల్లో చక్కర్లు కొట్టి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిని ముంచేందుకు కుట్రపన్ని రైతుల పంటలను బలిచేశారని ఆరోపించారు. 5 ఏళ్ల తెదేపా పాలనలో 3,759 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తే.., 18 నెలల్లో కేవలం 135.73 కోట్లు మాత్రమే విడుదల చేయటం రైతుల సంక్షేమం పట్ల మీ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన పంటలకు గత ప్రభుత్వం 50 నుంచి 100 శాతం పరిహారం పెంచితే వైకాపా సర్కార్ కేలవం 15 శాతం పెంపునకే పరిమితమైందని లేఖలో విమర్శించారు.
ఇదీచదవండి