కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం బసలదొడ్డిలో తెదేపా సానుభూతిపరులకు తాగునీటి సరఫరా నిలిపివేయటం హేయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కులమతాలకు అతీతంగా పాలన సాగిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రతిపక్ష పార్టీల వాళ్లకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాకు ఓట్లు వేస్తే తాగు నీరు ఇవ్వరా? అని నిలదీశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ సేవచేయాల్సింది పోయి తెదేపా కార్యకర్తలపై దాడులు చేయటంతో పాటు నీళ్లు, పింఛన్, రేషన్ ఆపి.. ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
పాలన గాలికొదిలేసిన జగన్ రెడ్డి తెదేపా మద్దతుదారులకు సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. 2 ఏళ్ల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలు తప్ప సాధించిన ప్రగతి శూన్యమని, మరో 3 ఏళ్లలో రాజారెడ్డి రాజ్యాంగం కాలపరిమితి ముగుస్తుందని అన్నారు.
ఇదీ చదవండి:
'సీఎం గారూ.. ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించండి'