విజయవాడలో ఒంటరి మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని 3 రోజుల్లోనే కేటుగాళ్లు 3 నేరాలకు పాల్పడ్డారు. గన్నవరం, పటమటలో చోటుచేసుకున్న ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. గన్నవరం మండలం కేసరపల్లిలో టీవీ మరమ్మతుల పేరుతో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై తిరిగాడు. గ్రామం అంతా రెక్కీ నిర్వహించిన అతడు... శివాలయం వీధిలోని ఓ మహిళను లక్ష్యంగా చేసుకొని గొలుసు తెంపుకుపోయాడు.
ముందుగా టీవీ రిపేరు పేరుతో ఆమె వద్దకు వెళ్లిన అతడు.. మంచినీళ్లు కావాలని అడిగాడు. నెమ్మదిగా మాటలు కలిపి ఒక్కసారిగా మెళ్లో గొలుసు లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. గ్రామంలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... మాస్క్ కారణంగా నిందితుడిని గుర్తించడం సాధ్యం కాలేదని తెలిపారు. ద్విచక్ర వాహనం నెంబర్ ఆధారంగా విచారించగా... కృష్ణలంకలో చోరీకి గురైన వాహనంగా తేలింది.
పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 2రోజుల కిందట ఓ వృద్ధురాలిని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో రహదారిపై వెళ్తుండగా.. బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు మెడలో గొలుసు లాక్కొని పరారయ్యారు. మరో ఘటనలో ఓ మహిళ మెడలో గొలుసు దోచేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. అయితే.. చేతికి చిక్కిన మంగళసూత్రాన్ని మాత్రం లాక్కొని నిందితులు తప్పించుకున్నారు. వరుస ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్, వాహనాల నంబర్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దుండగులు స్థానికులా, లేక ఇతర రాష్ట్రాల వారా అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండీ... అంతర్వేది ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారు: డీజీపీ