పచ్చని చెట్లు, దండకారణ్యంలో ఉండే మావోయిస్టులనూ (Maoist) కరోనా మహమ్మారి వదలడం లేదు. వైరస్ (Virus) సోకి చికిత్స కోసం హన్మకొండకు వస్తున్న కీలక నేతను తెలంగాణలో... వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు రోడ్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు.. ఓ కారులో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఒకరు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ (Madhukar).. అలియాస్ మోహన్.. అలియాస్ శోభ్రాయ్‌గా గుర్తించారు. కారును నడిపే మైనర్ హన్మకొండలో ఉంటున్నట్లు విచారణలో తేలింది.
ఆస్పత్రిలో వైద్యం..
కుమురంభీం అసిఫాబాద్ జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన గడ్డం మధుకర్ (Madhukar) పీపుల్స్‌వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1999లో సిర్పూర్ దళంలో చేరాడు. నాటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నాడు. పార్టీ ఆదేశాల మేరకు 2000 సంవత్సరంలో మధుకర్ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీకి బదిలీ అయ్యాడు.
నాటి నుంచి కీలక నేతలతో కలసి ఛత్తీస్‌గఢ్‌లో పలు ఘటనల్లో పాల్గొన్నాడు. పలువురు పోలీసులను హత్య చేసి ఆయుధాలు అపహరించిన కేసుల్లో నిందితుడు. గడ్డం మధుకర్‌పై రూ. 8 లక్షల రివార్డు ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి వెల్లడించారు. కొవిడ్ లక్షణాలతో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మధుకర్‌కు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
పలువురికి కొవిడ్..
కొంతమంది అగ్రనేతలతోపాటు క్యాడర్‌లో చాలామంది కొవిడ్ (Covid) బారినపడుతున్నారు. మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న పల్లెల్లో జనం కరోనా బారినపడుతున్నా.. వారిని మావోయిస్టు నేతలు వైద్యం తీసుకోకుండా కట్టడి చేస్తున్నారు. మావోయిస్టుల్లో చాలామంది కొవిడ్ బారినపడినట్లు తమకు సమాచారం ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అడవిని వీడి బయటకు వస్తే కొవిడ్, కొవిడేతర జబ్బులకు మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు.
కొరియర్ కోసం గాలింపు..
మావోయిస్టు కొరియర్‌గా పనిచేస్తున్న నరేశ్.. మధుకర్ చికిత్స కోసం ఓ మైనర్‌ను సంప్రదించాడని పోలీసులు తెలిపారు. మధుకర్‌ను వెంకటాపూర్ అటవీ ప్రాంతం నుంచి కారులో తీసుకువస్తుండగా పట్టుకున్నామన్న పోలీసులు.. కొరియర్ నరేశ్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: