ఇవాళ చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 67 లక్షల 75 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాలుగో విడత ఎన్నికలకు గానూ రాష్ట్రంలో 28 వేల 995 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,299 పంచాయతీలకు గానూ 554 పంచాయతీల్లో సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కడప జిల్లాలో రెండు చోట్ల సర్పంచి స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకపోవటంతో మొత్తం 2,743 పంచాయతీల్లో ఎన్నిక జరగనుంది.
సర్పంచి అభ్యర్థులుగా 7,475 మంది బరిలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అటు 33,435 వార్డు సభ్యులకుగానూ 10,921 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 91 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవటంతో మిగిలిన 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇందుకోసం 52,700 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
నాలుగో విడత ఎన్నికల్లో మొత్తం 28,995 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 6,047 సమస్యాత్మక, 4,967 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. పంచాయతీల వారీగా 53,282 మందిపోలింగ్ సిబ్బందిని కూడా నియమించినట్టు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది.
అయితే తుది దశ పంచాయతీ పోరుకు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్లు, ఉన్నతాధికారులు పరిశీలించారు. పోలింగ్ సరళిని వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకూ పోలింగ్ జరగనుండగా సాయంత్రం 4 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు.
ఇదీ చదవండి: నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం.. ప్రధాని దృష్టికి రాష్ట్ర సమస్యలు