కడప, తిరుపతి, ఒంగోలు, మచిలీపట్నం, విజయనగరం నగరపాలక సంస్థల్లో ప్రస్తుతం రెండు నుంచి మూడు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారు. వీటిల్లో అత్యధిక వార్డుల్లో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. జలాశయాల్లో నీటి ప్రవాహం నిలిచిపోవడం, భూగర్భ జలాలు అడిగంటి బోర్లు పనిచేయకపోవడంతో కుళాయిల్లో సరఫరా అంతంతమాత్రంగా ఉంది.
రాష్ట్రంలోని 107 పురపాలక, నగరపంచాయతీల్లోని 947 వార్డుల్లో రెండు నుంచి నాలుగు రోజులకొకసారి ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు. మదనపల్లె, ధర్మవరం, హిందూపురం, గిద్దలూరు, బేతంచెర్లలో సమస్య తీవ్రంగా ఉంది. మదనపల్లెలో కొన్ని వార్డుల్లో నాలుగురోజులకోసారి నీరిస్తున్నారు. పట్టణాల్లో ప్రస్తుతం రోజూ 706 ట్యాంకర్లతో 5,227 ట్రిప్పుల నీటిని అందిస్తున్నారు. 35 మిలియన్ లీటర్ల అవసరాలకు 24.1 మిలియన్ లీటర్లనే సరఫరా చేస్తున్నారు.
- ఏటా తప్పని అవస్థలు
ఏటా వేసవిలో 22 శాతం పట్టణాల్లో తాగునీటి సమస్య తలెత్తుతోంది. మే, జూన్ నాటికి 35 శాతం పట్టణాలకు సమస్య విస్తరిస్తోంది. అయిదు నగరపాలక సంస్థలు, మరో 23 పురపాలక సంఘాల్లో తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటోంది. వేసవి కార్యాచరణలో భాగంగా బోర్ల లోతు పెంచడం, బావుల్లో పూడిక తీయడం, పాత పైపుల స్థానంలో కొత్తవి వేయడం వరకే పరిమితమవుతున్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు.
ఇదీచదవండి.