ప్రాథమిక స్థాయి నుంచి బోధన మాతృభాషలోనే జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శాస్త్ర సాంకేతిక, వైద్య, న్యాయశాస్త్రాలు ప్రాంతీయ భాషల్లోనే భోదన జరగాలని ఆకాంక్షించారు. ఐఐటీ తిరుపతి 6వ ఇన్‌స్టిట్యూట్ డేలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. పద్మభూషణ్ గ్రహీత అనుమోలు రామకృష్ణ జీవిత చరిత్ర తెలుగు అనువాదం, వారసత్వ నిర్మాత పుస్తకాన్ని ఆవిష్కరించారు. అన్ని పుస్తకాలు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలని వెంకయ్య నాయుడు అన్నారు.
'ప్రభుత్వ పరిపాలన స్థానిక ప్రజల వాడుక భాషలో జరగాలి. కోర్టుల్లో జరిగే వాదప్రతివాదనలు మాతృభాషలోనే జరగాలి. కోర్టుల తీర్పులు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలి. ఆంగ్ల భాషకు నేను వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరూ వీలైనన్ని భాషలు నేర్చుకోవాలి. కొత్త ఆవిష్కరణలపై యువత ఆలోచించాలి. నిరంతరం పరిశోధనలపై దృష్టి పెట్టాలి'- ఉపరాష్ట్రపతి.
20 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఐఐటీ తిరుపతిలో ఉండటం ఆనందదాయకమని ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితం 2015లోనే జాతీయ స్థాయి విద్యాసంస్థకు శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేసుకున్నారు.
'విభజన సమయంలో ఈ ప్రాంతంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు కావడం ఆనందదాయకం. డైరెక్టర్ సత్యనారాయణ, ఆయన బృందానికి ప్రత్యేక అభినందనలు. భవిష్యత్తులో ఎడ్యుకేషనల్ హబ్‌గా మారనుంది. ఐఐటీ తిరుపతితో పాటు ట్రిపుల్ ఐటీ, శ్రీసిటీ, ఎస్వీ వర్సిటీ ఇక్కడే ఉన్నాయి. భవిష్యత్తులో దేశంలోనే పెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా ఈ ప్రాంతం మారనుంది. మన సంస్కృతిలోని గొప్పతనాన్ని పరిశోధించాలి'- ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఇదీ చదవండి:
త్వరలో డీఎస్సీ... 402 బ్యాక్‌లాగ్ టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం!