ఆలయాలను ఇక నుంచి తితిదే పరిధిలోకి తీసుకోమని ఈవో జవహర్‌రెడ్డి అన్నారు. ప్రముఖ ఆలయాలకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా 32 మంది భక్తులతో మాట్లాడారు. వారి నుంచి సమస్యలను, సూచనలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. తితిదే ఆధ్వర్యంలో గో ఉత్పత్తులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. గో ఉత్పత్తుల తయారీకి టెండర్లను పిలుస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని తితిదే గో సంరక్షణ ట్రస్టుకు కేటాయిస్తామన్నారు.
72 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకొని రావాలి...
ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిస్తామని.. 72 గంటల ముందు కొవిడ్ పరీక్ష చేయించుకుని రావాలని.. కరోనా పరీక్ష చేయించుకోని వారిని ఆర్జిత సేవలకు అనుమతించమని స్పష్టం చేశారు. కల్యాణ మండపాల లీజు 3 నుంచి 5 ఏళ్లకు పెంచుతున్నామని తితిదే ఈవో తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి
తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణకోసం కృషిచేస్తున్నామన్నారు. 150 విద్యుత్ వాహనాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. భవిష్యత్తులో తిరుమలలో తిరిగే వాహనాలన్నింటినీ గ్రీన్ ఎనర్జీతో తిరిగేలా ప్రణాలికలు రూపొందిస్తున్నామన్నారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా అలిపిరి, తిరుమలలో మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 24 నుంచి శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే తెప్పోత్సవాలకు భక్తులను అనుమతిస్తామని ఈవో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి