తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన నేడు తితిదే సర్వసభ్య సమావేశం జరగనుంది. 2020-2021 సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించడంతో పాటు వాటికి ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ 3వేల 243 కోట్ల రూపాయలు కాగా.. వచ్చే ఏడాదికి 3500 కోట్ల రూపాయలకు పెంచనున్నారు. వివిధ శాఖలకు కేటాయించే నిధుల కుదింపు, అనవసర వ్యయం తగ్గింపు, నిధుల సమీకరణపై దృష్టి సారించిన ధర్మకర్తల మండలి అందుకు తగిన రీతిలో కసరత్తు చేస్తోంది. దేవస్థానం పరిధిలోని ఇతర ఆలయాలు, విద్యా, వైద్య సంస్థల్లో అత్యవసరాల మేరకు డబ్బులు ఖర్చు చేయాలన్న నిర్ణయానికి వచ్చిన మండలి అందుకు తగిన రీతిలో బడ్జెట్ అంచనాలను రూపొందించారు.
తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రధానాంశాలు
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు తితిదే విలీనంపై నిర్ణయం
- ఇంజినీరింగ్ విభాగానికి నిధుల కోత
- ఎస్వీబీసీని స్వయం ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రతిపాదనలు
- గతంలో మాదిరే తితిదే ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లో జమచేసే అంశంపై పునఃపరిశీలన
- డిప్యూటీ ఈవో, ఏఈవో, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు కొత్తగా 288 ఉద్యోగాల భర్తీకి ఆమోదం
- కల్యాణమండపాల నిర్వహణ వ్యయంగా మారిన నేపథ్యంలో కొత్త నిర్మాణాల అనుమతిలో నిబంధనల మార్పు
- తలకోన సిద్ధేశ్వరస్వామి ఆలయం పుష్కరిణి నిర్మాణానికి రూ.1.23 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు
- తిరుమలలో మూడో దశలో 1300 సీసీ కెమెరాల ఏర్పాటు.... 20 కోట్ల రూపాయల టెండర్లు
- అలిపిరి వద్ద టోల్ రుసుం పెంపు
- ద్విచక్ర వాహనాలకు 5, కార్లు, జీపులు, ట్యాక్సీలకు 50, మినీ బస్సు, మినీ లారీలకు 100 రూపాయల వసూలుకు యోచన
- దేశవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న తితిదే ఆస్తులను వేలం ద్వారా విక్రయానికి ప్రతిపాదన
- తిరుమలలోని శ్రీపాదం అతిథి గృహంలోని గదుల ధరల పెంపు