జీవితంలో జరిగే అనేక ఘటనల్లో కొన్నింటికి మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉంటే... మరికొన్నింటిని అసలు గమనించలేం. కానీ ఎటువంటి క్షణాలనైనా... శాశ్వతంగా బంధించేది ఫొటోగ్రఫీ మాత్రమే. కెమెరా కనిపెట్టిన కొత్తలో ఫొటోలు దిగటం అంటేనే ఓ వింత. అక్కడి నుంచి ప్రారంభమైన ఫొటోగ్రఫీ ప్రస్థానం... ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని ఔత్సాహికులందరికీ అందుబాటులోకి వచ్చింది. కొన్ని ఫొటోలు మానవత్వాన్ని తట్టిలేపగా... మరికొన్ని ప్రపంచదేశాలను గడగడలాడించాయి. యుద్ధాలనూ ఆపాయి. అంతరించిన జీవజాతులను భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాయి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేళ తిరుపతికి చెందిన కొందరు యువ ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఈ విషయాలను గుర్తుచేసుకున్నారు.
అంతరిక్షం ఓ అద్భుతం
ఖగోళ సంబంధిత విషయాలను కెమెరాతో బంధించటం శ్రవణ్ హాబీ. చిన్నతనం నుంచి అంతరిక్షంపై ఉన్న ఇష్టంతో... తోకచుక్కలు, గెలాక్సీల గురించి తెలుసుకుంటూ... ఆస్ట్రో ఫొటోగ్రఫీపై ఇష్టం పెంచుకున్నాడు. దీనిపై అవగాహన ఉంటే.... ఉన్నచోట నుంచే స్మార్ట్‌ఫోన్‌లోనూ నమ్మశక్యం కాని ఫొటోలు తీయొచ్చని నిరూపిస్తున్న శ్రవణ్... అనవసరంగా దీపాలు వినియోగించటం వల్ల వచ్చే కాంతి కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు తన ఫొటోలనే ఉపయోగించుకున్నాడు.
రాత్రిని కెమెరాలో బంధిస్తాడు
కుప్పంలో ఎమ్ బీబీఎస్ చదువుతూ... వారాంతాల్లో దొరికే కొద్ది సమయాన్ని ఫొటోగ్రఫీకే వినియోగిస్తున్న ఈ యువకుడి పేరు అవినాష్. రాత్రి సమయాల్లో ప్రశాంతంగా ఉండే నగరాన్ని కెమెరాలో బంధిస్తున్నారు. నైట్ స్కేప్ ఫొటోగ్రఫీతో.. తిరుపతి, తిరుమల ఘాట్ రహదారులు, అలిపిరి, తిరునగరి అందాలను బంధిస్తున్నాడు.
తిరునగరి అందాలపై క్లిక్
శేషాచలం అందాలతోపాటు... విభిన్న కాలాల్లో తిరునగరి అందాలకు ఫొటో రూపమివ్వటం శశి ప్రత్యేకత. బ్యూటిఫుల్ తిరుపతి పేరిట సామాజిక మాధ్యమాల్లో అతను పోస్ట్ చేసే ఎన్నో ఫొటోలు... చాలా మంది ఫోన్లలో వాల్‌పేపర్లుగా, స్టేటస్‌లుగా ప్రత్యక్షమయ్యాయి. ఓ వైపు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూనే... అందాన్ని కెమెరాలో బంధిస్తున్నారు.
హావభావలే ప్రాణం
మనిషి సహజమైన హావభావాలే తన ఫొటోలకు ప్రాణంగా భావించే గుణశ్రీ.... తిరుపతికి చెందిన తొలి మహిళా స్ట్రీట్ ఫొటోగ్రాఫర్. ఎంటెక్ పూర్తి చేసిన ఆమె... శ్రీవారి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల భావాలకు ఫొటో రూపమివ్వటంలో అనేక ప్రయోగాలు చేశారు. వివాహమైనా... తన అభిరుచిని కొనసాగిస్తున్నారు.
అడవే ప్రపంచం
అడవి నుంచే వచ్చిన మనిషి... ఆ అడవికే పూర్తిగా దూరమైపోతున్నాడనే సందేశాన్ని అందించే ఇతని పేరు గోపి. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, బర్డ్‌వాచర్‌గా పేరు సంపాదించిన ఆయన... శేషాచలం అడవుల్లో ఎన్నో వన్యప్రాణులను డిజిటల్ ఫ్రేముల్లో నిక్షిప్తం చేశారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నా... వారానికోసారి ప్రకృతికి దగ్గరగా గడపాలనే తన కోరికే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా రాణించేలా చేస్తోందని చెప్పారు.
లోతైన భావాలు పలికించే హనీష్ ఫొటోలు
ఆధునిక జీవితం పెంచే ఒత్తిడి వంటి డార్క్‌థీమ్స్‌తో సరికొత్తగా ఫైన్ ఆర్ట్ ఫొటోలు తీస్తున్న హనీష్... తనకున్న ఆలోచనలను మనిషి స్వభావానికి అనుసంధానం చేస్తున్నారు. ప్రత్యేకంగా సందేశాలేమీ ఇవ్వకుండా... బ్లాక్‌లో అందాన్ని, లోతైన భావాలను ఫొటోలతో పరిచయం చేయటం హనీష్ ప్రత్యేకత.
వీళ్లంతా విభిన్న రంగాలకు చెందినవాళ్లే అయినా... ఫొటోగ్రఫీ అంటే ఉన్న ఇష్టం వీళ్లను ఒక్కటి చేసింది. అవినాష్, హనీష్ కలిసి స్థాపించిన ఫోటోగ్రఫీ క్లబ్ - తిరుపతి అనే వేదికగా ఫొటోగ్రఫీపై తమ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఒత్సాహిక ఫొటోగ్రాఫర్ల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి : వీడ్కోలుపై ప్రధాని మోదీ లేఖకు 'మిస్టర్‌కూల్' స్పందనిదే..