తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాజపా-జనసేన కూటమి అభ్యర్థినిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.రత్నప్రభ బరిలో నిలిచారు. ఆమె పేరును గురువారం భాజపా ఖరారు చేసింది. రాష్ట్రానికి చెందిన రత్నప్రభ.. 1981 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి. కొన్నాళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ పని చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేసిన ఆమె 2018 జూన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉద్యోగ విరమణ చేశారు. 2019లో భాజపాలో చేరారు. రత్నప్రభ తండ్రి చంద్రయ్య, భర్త విద్యాసాగర్ కూడా ఏపీ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారులే. తిరుపతి లోక్‌సభ స్థానానికి అందరికంటే ముందుగా తెదేపా పనబాక లక్ష్మిని అభ్యర్థినిగా ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాగానే వైకాపా గురుమూర్తిని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్లే. ఆయన ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు.
ప్రజాసేవకు అనువైన అభ్యర్థి రత్నప్రభ: సోము వీర్రాజు
భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా ఎంపికైన రత్నప్రభకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఐఏఎస్‌గా ప్రజాజీవితంలో ఆమెకు సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉందని, ప్రజలకు సేవ చేసేందుకు అనువైన అభ్యర్థి అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
జగనన్న విద్యా దీవెన నగదును.. తల్లుల ఖాతాల్లో జమ చేయాలి: సీఎం