YV Subbareddy statements on ttd assets: శ్రీవారి ఆస్తుల వివరాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా తితిదేకు 960 ఆస్తులున్నట్లు ఆయన తెలిపారు. వీటి విలువ సుమారు రూ.85,705 కోట్లు అని పేర్కొన్నారు. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 7వేల ఎకరాల భూమితో పాటు రూ.14వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 14 టన్నుల బంగారం కూడా ఉందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 1974 నుంచి 2014 మధ్య కాలంలో టీటీడీకి చెందిన 114 ఆస్తులు అమ్ముడుపోయాయని తెలిపారు. దీని తర్వాత ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు. గత ఐదు నెలల్లో విరాళాల ద్వారా టీటీడీకి నెలవారీ ఆదాయం పెరిగిన తరుణంలో ఈ విషయం వెల్లడైంది. టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ. 700 కోట్ల ఆదాయం వచ్చింది.
తిరుమలలో భక్తులకు మరింత వసతి సౌకర్యం కల్పించడానికి రూ.95 కోట్లతో 5వ భక్తుల వసతి సముదాయం (పీఏసీ - 5) నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో అదనంగా తరగతి, హస్టల్ గదుల నిర్మాణానికి రూ.6.37 కోట్లు కేటాయించామని తెలిపారు. వకుళామాత ఆలయ సమీపంలోని జాతీయ రహదారి నుంచి జూపార్క్ రోడ్డును అనుసంధానం చేయడానికి రూ.30 కోట్లు కేటాయించామన్నారు.
తిరుమలలో వసతి పరిమితంగా ఉండటం, భక్తుల రద్దీ అధికమవుతున్న దృష్ట్యా పలు చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణకు రూపొందించిన ప్రణాళికను బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఇవి చదవండి: