ఉభయ దేవేరుల సమేతుడై మలయప్ప స్వామి రూపంలో విహరించే బ్రహ్మాండ నాయకుడికి జరిగే ఈ వైభవోత్సవాలు....ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి. కళలకు కాణాచిలా.... సర్వజీవులకు పరమాత్మ తానేనంటూ శేషాద్రివాసి బ్రహ్మోత్సావాల వేళ వివిధ వాహనాలపై సాగించే ఆ పయనం అనిర్వచనీయం. స్వామీ నువ్వే రక్ష అంటూ సాగిలపడిన భక్తులను అనుక్షణం బ్రోచే ఆ కరుణా కటాక్ష వీక్షణాలు... బ్రహ్మోత్సవ వేళ ఆనందహేళితో ద్విగుణీకృతమవుతాయి.
బ్రహ్మోత్సవాల వేళ స్వామి వారి వైభవాన్ని దర్శిచేందుకు లక్షలాదిగా భక్తులు తిరుగిరులకు తరలివస్తుంటారు. సాధారణ సంవత్సరాల్లో ఏటికి ఒకసారే బ్రహ్మోత్సవాలు సాలకట్ల బ్రహ్మోత్సవాలు పేరిట నిర్వహిస్తుంటారు. కానీ అధికమాసం వచ్చిన సంవత్సరం మాత్రం ఏడాదికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించటం పరిపాటి. నవరాత్రి బ్రహ్మోత్సవాల పేరిట... ఒకే ఏడాదిలో రెండో సారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఏడాది పొడవునా.. 450 ఉత్సవాలు జరుగుతాయి. అన్నింటిలో అత్యంత వైభవోపేతమైనవి బ్రహ్మోత్సవాలే.
తిరుమలలో తొలి బ్రహ్మోత్సవం.. బ్రహ్మ చేతులమీదుగా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో తమిళ పంచాంగాన్ని అనుసరించడం ఆనవాయితీ. తమిళ పురాత్తసి మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏటా సర్వసాధారణంగా.... సంస్కృతం ప్రకారం కన్యామాస శ్రవణం, తెలుగు పంచాగం ప్రకారం భాద్రపద మాసం శ్రవణా నక్షత్రంలో.. తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు 14 వాహనాలపై స్వామి వారు విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. ప్రతి ఐదేళ్లకు రెండు అధికమాసాలు వస్తాయి కనుక...ఆ అధిక మాసం వచ్చిన సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వీయుజ శుద్ధ దశమి... అంటే విజయ దశమి వరకూ మరో మారు ...బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వీటినే నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు. బ్రహ్మోత్సవాల వైభవం ఒకటే అయినా... వాహనాల్లో మాత్రం స్వల్ప తేడాలుండటం ఈ రెండో బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది.
ఏటా సర్వసాధారణంగా జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంకురార్పణ.. ధ్వజారోహణంతో ప్రారంభమై... తొమ్మిదో రోజు చక్రస్నానం...సాయంత్రం ధ్వజఅవరోహణంతో ముగుస్తాయి. కానీ... నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ ధ్వజ ఆరోహణ, అవరోహణం ఉండదు. సుదర్శన చక్రస్నానంతోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రతి రెండేళ్ల తర్వాత వచ్చే మూడో ఏడు మాత్రమే ఈ నవరాత్రి బ్రహ్మోత్సాలను మనం చూడగలం.
గతేడాది రెండు బ్రహ్మోత్సవాలు జరిగిన కారణంగా.... ఈ ఏడు, వచ్చే ఏడు స్వామి వారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మాత్రమే జరుగుతాయి. వాహన సేవల్లో ఉండే స్వల్వ తేడాలు సైతం వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మనం గమనించవచ్చు.
సాధారణ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు సాయంత్రం స్వర్ణ రథంపై స్వామివారు విహరిస్తూ భక్తులకు అభయమిస్తారు. ఎనిమిదో రోజు ఉదయం దారు అంటే చెక్కతో చేసిన రథంపై స్వామి వారు ఊరేగుతూ అభయప్రదానం చేస్తారు. కానీ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాత్రం ఆరో రోజు సాయంత్రం స్వర్ణ రథోత్సవం జరగదు. దానికి బదులుగా పుష్పకవిమానంపై స్వామి వారు ఉత్సవంలో పాల్గొనటం దర్శించుకోవచ్చు. ఎనిమిదో రోజు ఉదయం సాధారణ బ్రహ్మోత్సవాల్లో దారు అంటే చెక్క రథంపై స్వామి వారు ఊరేగితే...నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాత్రం స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అంటే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి దారు రథోత్సవం మనం చూడలేం. ప్రతి రోజూ సాయంత్రం వాహనం ముగిసిన తర్వాత రంగనాయకుల మండపంలో స్వామి వారికి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించటం మాత్రం.. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది.
రెండు బ్రహ్మోత్సవాలకు స్వల్ప వైరుధ్యాలున్నా..... 9 రోజుల పాటు 14 వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరించే ఆ వైభవం రెండు బ్రహ్మోత్సవాల్లోనూ అనిర్వచనీయం. పెద్దశేష వాహనం, చిన శేష వాహనం, హంస, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహినీ అవతారం, ఉత్సవాలకే ప్రత్యేకమైన గరుడ వాహనం, హనుమంత వాహనం, గజ వాహనం, సూర్య, చంద్ర ప్రభ, అశ్వ వాహనాలపై శ్రీవారి వైభవం చూడాలంటే అది కేవలం బ్రహ్మోత్సవాల్లోనే సాధ్యం. లక్షల కొద్దీ తరలివచ్చే భక్తులతో బ్రహ్మోత్సవాల వేళ తిరుగిరులు కిక్కిరిసి పోతాయి. పూటకో వాహనంపై ఊరేగే బ్రహ్మాండ నాయకుని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు...అనిర్వచనీయమైన అనుభూతితో సద్గతిని పొందుతారు.