తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాల పర్యవేక్షకులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించాలని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం కైంకర్యాల పర్యవేక్షకుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనాల కొనసాగింపు అంశంపై సమీక్షిస్తామని చెప్పారు.
కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో తిరుమలలో దర్శనాలు నిలిపివేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి ట్విటర్‌లో గళమెత్తారు. కొన్ని వారాలపాటు భక్తులకు దర్శనాలు ఆపాలని సూచించారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరన్న ఆయన వారిని సంరక్షించి, స్వామివారికి ఏకాంతంగా పూజలు నిర్వహించాలన్నారు.
దర్శనాలు నిలిపివేయడమే భక్తులందరికీ శ్రేయస్కరమని తితిదే బోర్డు మాజీ సభ్యుడు, భాజపా నేత భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. అర్చకులు, భక్తుల భద్రత దృష్ట్యా స్వామివారి కైంకర్యాలు గతంలో 83 రోజులు ఎలా ఏకాంతంగా నిర్వహించారో ఆవిధంగా చేయాలని సూచించారు. ఇప్పటికైనా తితిదే ఛైర్మన్, బోర్డు సభ్యులు స్పందించి భక్తుల అనుమతిని రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి...
'శ్రీవారి దర్శనాలు నిలిపివేయండి'.. రమణ దీక్షితులు మరో ట్వీట్