సరదా కోసం ఆడిన ఆట వ్యసనమై ఓ యువకుడిని బలి తీసుకుంది. తితిదే ఉద్యోగి భాస్కర్ తిరుపతి శివారులోని బీటీఆర్ పురంలో నివాసముంటున్నారు. ఆయన కుమారుడు తేజేష్ (17)ఇంటర్ విద్యార్థి. కరోనా కారణంగా కళాశాలలు లేక 6 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. కొందరు స్నేహితులతో కలసి పబ్జీ ఆడేవాడు. పోటీపడి ఆడలేక ఓడిపోతూ రోజూ డబ్బులు పోగొట్టుకునేవాడు. ఆన్‌లైన్ వ్యాపారం చేస్తానంటూ రూ.3 లక్షలు ఇమ్మని తల్లిదండ్రులను అడిగాడు. ఆ సొమ్ముతో పబ్జీ గన్ కొంటానని స్నేహితులకు చెప్పాడు.
తల్లిదండ్రులు డబ్బు ఇవ్వకపోవడంతో నొచ్చుకున్నాడు. శుక్రవారం రాత్రి తన గదిలోకి వెళ్లి చివరగా 12.28 గంటలకు స్టేటస్‌లో పబ్జీ ఆడుతున్న ఫొటో పోస్టు చేశాడు. తర్వాత ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మరణించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అలిపిరి ఎస్‌ఐ పరమేశ్వర నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఎస్వీ వైద్య మెడికల్ కళాశాలకు తరలించారు.
ఇదీ చదవండి: