పుట్టుకతో సంక్రమించిన శారీరక లోపాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగేలా సంకేత భాష బధిరులకు ఆసరాగా నిలుస్తోంది. కనుకనే ప్రపంచ బధిరుల సమాఖ్య ఏటా సెప్టెంబర్ 23ను ప్రపంచ సంకేత భాషా దినోత్సవంగా నిర్వహిస్తోంది. 1951లో బధిరుల హక్కుల పరిరక్షణ కోసం ఇదే రోజున ఏర్పాటైన ఈ సంస్థ 2018 నుంచి వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో మొదటి రోజును సంకేత భాషను కాపాడుకోవాలనే సందేశంతో ప్రపంచ సంకేత భాషా దినోత్సవంగా జరుపుతూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5 శాతం మంది ప్రజలు వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు. భారత్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 13 లక్షల మంది పూర్తి స్థాయి బధిరులు ఉన్నారు. కోటి 80 లక్షల మందికి వివిధ రకాల వినికిడి సమస్యలున్నట్లు తేలింది. అయితే... సంకేత భాష నిరాదరణకు గురవుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశం మొత్తం మీద కేవలం 388 బధిర పాఠశాలలు మాత్రమే ఉండటం పరిస్థితికి నిదర్శనం. భారత రాజ్యంగం ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరి హక్కు. దేశంలో 22 అధికారిక భాషల్లానే సంకేత భాషనూ గుర్తించాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది.
బధిరుల పాఠశాలలు, కళాశాలల సంఖ్య పెంపు, నిపుణులతో విద్యాబోధన లాంటి చర్యల ద్వారానే అందరితో సమానంగా వారికీ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు సైతం చిన్న వయసులోనే సమస్యను గుర్తించి, సకాలంలో తగిన చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: