ఎస్సీ సంఘాలు చలో మదనపల్లె పిలుపునిచ్చిన క్రమంలో చిత్తూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. బి.కొత్తకోటలో న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రను పరామర్శించేందుకు తిరుపతి చేరుకున్న న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ను పోలీసులు హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. హోటల్ గది నుంచి అల్పాహారం కోసం బయటకు వచ్చేందుకు పోలీసులు నిరాకరించడంతో.. హోటల్ గదిలోనే శ్రవణ్‌కుమార్ నిరసనకు దిగారు. న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ను గదిలో నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఎస్సీ సంఘాల నేతలు హోటల్ ముందు ఆందోళన చేపట్టారు. శ్రవణ్‌కుమార్‌ను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ధర్నాకు దిగిన ఎస్సీ సంఘాల నేతలను అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్బంధం అక్రమమంటూ న్యాయవాది శ్రవణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
విశ్రాంత న్యాయమూర్తి శ్రవణ్‌కుమార్ చలో మదనపల్లె పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడికి నిరసనగా.. తెలుగుదేశం నాయకులు మదనపల్లెకు బయలుదేరారు. చలో మదనపల్లె పిలుపుతో పలువురు తెలుగుదేశం నాయకులను పోలీసులు ముందుగానే గృహనిర్బంధం చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్‌ఛార్జి నర్సింహ ప్రసాద్‌ను అరెస్టు చేశారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పలువురు తెదేపా నేతలు అరెస్టు అయ్యారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, నాయుడుపేటలో మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యంను గృహనిర్బంధం చేశారు.
శ్రవణ్ కుమార్ నిర్బంధానికి నిరసనగా తిరుపతిలో దళిత నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని బస్టాండ్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం తగదన్నారు.
కాసేపటికి ఎస్సీ సంఘాల నేతలను పోలీసులు విడుదల చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవికి వినతిపత్రం అందించారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చి ఆందోళనను నేతలు విరమించారు.
ఇదీ చదవండి: 'తెర'లేస్తోన్న వినోదం.. జనాలు ఇంతకు ముందులా వస్తారా?