తిరుపతి పర్యటక డివిజన్‌లో 90 శాతం సేవలు పునరుద్ధరించినట్లు, ఈనెలాఖరుకు అన్ని రకాల సేవలను అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆ శాఖ నూతన డివిజనల్ మేనేజర్ ఎం.గిరిధర్‌రెడ్డి తెలిపారు. పర్యటకశాఖ నూతనంగా అందుబాటులోకి తెచ్చిన రెండు స్థానికాలయాల ప్యాకేజీల గురించి మంగళవారం ఆయన వెల్లడించారు. పర్యటకశాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజూ తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయాల నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5గంటలకు తిరుపతి చేరుకునేలా స్థానిక ఆలయాల ప్యాకేజీలు ఉన్నాయని వివరించారు. భక్తుల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రతి రోజూ శ్రీకాళహస్తి- శ్రీనివాసమంగాపురం- తిరుచానూరు- కపిలతీర్థం- ఆగస్తీశ్వరాలయం సందర్శనకు ఒక్కొక్కరికి రూ.250(నాన్ ఏసీ బస్సు), రూ.350(ఏసీ బస్సు) ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. కాణిపాకం- తిరుచానూరు- శ్రీనివాస మంగాపురం- కపిలతీర్థం- అగస్తీశ్వరాలయం సందర్శనకు ఒక్కొక్కరికి రూ.300(నాన్ ఏసీ), రూ.450 (ఏసీ బస్సు) తో ప్రత్యేక ప్యాకేజీ రూపొందించినట్లు వివరించారు.
హార్సిలీహిల్స్ ఆదాయం పెంపుపై దృష్టి
హార్సిలీహిల్స్ నుంచి నెలకు సగటున రూ.30 లక్షల ఆదాయం వస్తుందని, 2021 జనవరి నుంచి ఈ ఆదాయాన్ని రూ.50 లక్షలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు గిరిధర్‌రెడ్డి తెలిపారు. కుప్పం, పలమనేరులోని పర్యాటక కేంద్రాల హోటళ్లు తప్ప జిల్లాలోని మిగిలిన హోటళ్లు తెరుచుకున్నాయని, నెల రోజుల్లో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, విడిది గృహాల్లో నాణ్యమైన సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:
తితిదేకు గుదిబండగా మారుతున్న శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్..!