కార్తిక మాసంలో విష్ణు స్మరణ అత్యంత ఫలదాయకమని తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆలయ పండితులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. కార్తిక మాసంలో శ్రీ మహావిష్ణువుకు సంబంధించి పురాణాల్లో చెప్పిన విశేషాలను దృష్టిలో ఉంచుకుని వాటిని దశదిశలకు వ్యాప్తి చేయటంతో పాటు... కరోనా వ్యాధి నిర్మూలనకు తితిదే ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 19 నుంచి డిసెంబర్ 13వ తేదీవరకూ తిరుమల వసంత మండపంలో వైఖానసాగమబద్ధంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తిరుపతి కపిల తీర్థంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆలయ అర్చకులు, ఆగమ పండితులు...ఎస్వీ వేదవిశ్వవిద్యాలయంలో రుద్రాభిషేకాలను నిర్వహించనున్నామన్నారు. నవంబరు 29న సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకూ తితిదే పరిపాలనా భవనం మైదానంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహించాలని తితిదే నిర్ణయించినట్లు ప్రకటించారు.
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని తిరుమలలో... కైశిక ద్వాదశి, బేడీ ఆంజనేయస్వామికి అభిషేకం వంటి కార్యక్రమాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీమహావిష్ణువు అవతారమైన వ్యాసమహర్షి తాను రచించిన నారదీయ, స్కంద, పద్మపురాణాల్లో... కార్తిక మహత్యంలో విష్ణువ్రతాలు, కథలు, విష్ణుస్మరణే ఎక్కువగా కనబడుతుందని పండితులు వివరించారు.
ఇదీ చదవండి: