తిరుపతి ఉపఎన్నిక సన్నద్ధత, వ్యూహరచనపై లోక్‌సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవరాల ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలతో... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా మండలస్థాయి నేతలతో విడివిడిగానూ భేటీ అయ్యారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న పెద్ద ఎన్నికైన తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను... పార్టీ శ్రేణులు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు నిర్దేశించారు.
పురపాలక ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా... స్థానిక నాయకులు ధైర్యంగా ప్రతిఘటించిన తీరును చంద్రబాబు ప్రశంసించారు. తిరుపతి ఉపఎన్నికల్లోనూ అక్రమ కేసులు, నిర్బంధాలతో దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని.. అలాంటి వాటికి భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ఇకపై పనిచేసే వారికే ప్రాధాన్యం ఇస్తామన్న చంద్రబాబు... పార్టీకి విధేయంగా ఉన్నారనో, సామాజిక సమీకరణాల కోసమో ఎవర్నీ భరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల పర్యవేక్షణకు... అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, లోకేశ్, బీదా రవిచంద్ర, పనబాక కృష్ణయ్యతో కమిటీ ఏర్పాటు చేశారు.
తిరుపతి ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేశారు. చిత్తూరు జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాల కోసం ఒకటి, నెల్లూరు జిల్లా పరిధిలోని నాలుగు స్థానాల కోసం మరొకటి కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రెండు జిల్లాలకు చెందిన ఒక ముఖ్య నాయకుడిని, మరో మాజీమంత్రిని... ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జులుగా నియమించారు.
అసెంబ్లీ నియోజకవర్గాన్ని 25 క్లస్టర్లుగా విభజించి, సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. తిరుపతిలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఉంటుందని... ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి రోజుకో అంశంపై ముద్రించే కరపత్రాలను గడప గడపకూ వెళ్లి పంచాలని చంద్రబాబు ఆదేశించారు. 10 రోజులపాటు ఈ కార్యక్రమం జరగాలన్నారు.
తిరుపతి ఉపఎన్నికల అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన పనబాక లక్ష్మి... ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. 20వ తేదీ నుంచి 23 వరకు లోక్‌సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల కార్యకర్తలతో ఆమె సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పనబాక లక్ష్మి... పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు.
తెలుగుదేశం నాయకులపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుందనే అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా మాజీమంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలు నవ్వులూ పూయించాయి. వైకాపా వాళ్లు కేసులు పెట్టడం, జైలుకి వెళ్లడం తప్పదని తెలిశాక... వారంపాటు లోపల ఉండి వచ్చిన బీటెక్ రవికి ఫోన్ చేసినట్లు చెప్పారు. జైల్లో అటాచ్డ్ బాత్‌రూం సదుపాయం ఉందని రవి చెప్పడంతో... జైలుకి వెళ్లడానికి సిద్ధమేనని అన్నట్లు సోమిరెడ్డి తెలిపారు. ఈ మాటతో చంద్రబాబు సహా నేతలంతా గట్టిగా నవ్వారు.
ఇదీ చదవండీ... సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ.. హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్