తిరుపతిని ఎవరు అభివృద్ధి చేయగలరో ప్రజలు ఆలోచించాలని పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి ఎన్నికలో భాజపా-జనసేన అభ్యర్థి రత్నప్రభ తరఫున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. శంకరంబాడి కూడలిలో జనసేన-భాజపా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైకాపా అభ్యర్థి గెలిచినా దిల్లీలో ఇక్కడి సమస్యలు చెప్పలేరని పేర్కొన్నారు. ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న వైకాపా ఏం చేసింది? అని పవన్ ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వం సామాన్యులపై ప్రతాపం చూపిస్తోంది. వైకాపా నేతలకు దమ్ముంటే వారి ప్రతాపం నాపై చూపించాలి. అధికారం బదలాయింపు జరగాల్సిందే. వైకాపాకు ఓటేయకుంటే సంక్షేమ పథకాలు పోతాయని బెదిరిస్తున్నారు. జనం గుండెల్లో ఉన్న అభిమానం నాకు చాలు. సీఎం అయితే ప్రజలకు మరింత బాగా సేవ చేయవచ్చు. దివంగత వైకాపా ఎంపీకి జనసేన తరఫున నివాళులు. - పవన్ కల్యాణ్, జనసేన అధినేత
కోట్ల రూపాయలు పన్నుకట్టా తప్ప.. కాంట్రాక్టులు కాజేయలేదని పవన్ వ్యాఖ్యానించారు. తిరుపతి నడిబొడ్డు నుంచి వైకాపాను హెచ్చరిస్తున్నానని.. ఇది నవతరం.. చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ప్రతీ వైకాపా ఎమ్మెల్యే గుండాలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్నమయ్య నడయాడిన నేల, కృష్ణదేవరాయలు ఏలిన నేల ఇది అని.. పోరాడితే బానిస సంకెళ్లు పోతాయని పవన్ అన్నారు. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్‌లు లేవని.. అందుకే మళ్లీ సినిమాలు చేస్తున్నానని పేర్కొన్నారు. రాగిసంగటి తిని బతుకుతా తప్ప తప్పుడు పనులు చేయనని స్పష్టం చేశారు.
'వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం దశ, దిశ మారాలి. స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థను తీసుకురావాలి. తిరుపతి ఎంపీగా అర్హత ఎవరికి ఉంది?. వైకాపా ఎంపీ గెలిచినా ఆయనకు గొంతు ఉంటుందా?. 151 మంది ఎమ్మెల్యేలు, 22మంది ఎంపీలు ఇస్తే వైకాపా ఏం చేసింది?. అమాయకులపై కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారు. దమ్ముంటే నా జోలికి రండి చూసుకుందాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయి. వైఎస్ వివేకా మృతి కేసులో రెండేళ్లుగా పురోగతి లేదు. కోడి కత్తి వ్యవహారం ఏమైంది?. రేషన్ డోర్ డెలివరీ లేదు కానీ.. ఎర్రచందనం చైనాకు పోతోంది.' అని పవన్ అన్నారు.
అంతకుముందు ఎమ్మార్‌పల్లి నుంచి పవన్ పాదయాత్ర చేశారు. అయితే కార్యకర్తలు, అభిమానుల రద్దీతో పాదయాత్ర ఆపేశారు. అన్నమయ్య కూడలి నుంచి శంకరంబాడి కూడలి వరకు వాహనం పైనుంచి అభివాదం చేస్తూ బహిరంగ సభకు చేరుకున్నారు.
ఇదీ చదవండి: బైపోల్: గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు