దేశ సరిహద్దులో సైనికులు నిరంతరం పోరాటం చేయడం వల్లే మనం ఇక్కడ సంతోషంగా ఉంటున్నామని.. అలాంటి సైనికులకు అండగా ఉంటూ, తోచిన సాయం చేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని నటుడు మంచు విష్ణు అన్నారు. ఓ భారత సైనిక అధికారి రాసిన లేఖకు స్పందించిన నటుడు మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలలో వీర జవాన్ ప్రవీణ్ కుమార్ కుమార్తెకు పూర్తిగా ఉచిత విద్య అందిస్తామని తమ ఔదార్యం చాటుకున్నారు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన సి.హెచ్. ప్రవీణ్ కుమార్(36).. భారత సైన్యంలో పనిచేసేవారు. శ్రీనగర్ 18వ రెజిమెంట్లో విధులు నిర్వర్తిస్తుండగా.. నవంబర్ 8, 2020లో జరిగిన ఉగ్రవాదుల ఎదురుదాడిలో వీరమరణం పొందాడు. అతనికి భార్య రజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిని అందరూ పరామర్శించిన వాళ్లే కాని కానీ సాయం చేసిన ఒక్కరూ లేరు. ప్రభుత్వ సాయం తప్ప వీరికి ఎలాంటి ఇతర సహాయం అందలేదు.
లేఖకు స్పందించిన మోహన్ బాబు
జవాన్ కుటుంబ పరిస్థితి తెలుసుకున్న 18వ రెజిమెంట్ అధికారులు కల్నల్ నరేష్, కమాండింగ్ ఆఫీసర్.. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్, ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబుకు స్వయంగా లేఖ రాశారు. వారి కుటుంబాన్ని ఏ విధంగానైనా ఆదుకోవాలని కోరారు. ఆ లేఖకు స్పందించిన మోహన్ బాబు, మంచు విష్ణు వీర జవాన్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.
విష్ణు ఆశ్చర్యపోయారు..
వీరి కుటుంబంలో 64 మంది భారతసైన్యంలో పని చేస్తున్నారని తెలుసుకొన్న మంచు విష్ణు ఒకింత ఆశ్చర్యపోయారు. జవాన్ కుమార్తె సి.హెచ్.లోహితకు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలో ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి ఉచిత విద్య అందిస్తామని మోహన్ బాబు హామీ ఇచ్చారు. మానవత్వం చాటుకున్న శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల సీఈవో మంచు విష్ణు, ఛైర్మెన్ మోహన్ బాబుకు జవాన్ భార్య రజిత కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి...