ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరంలో నేటికి కొన్ని ప్రాంతాల్లో కనీస వసతులు లేక నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతి నగరంలోనే అతిపెద్ద గృహ సముదాయంగా గుర్తింపు పొందిన రాధేశ్యాం అపార్ట్‌మెంట్‌తో పాటు శివజ్యోతి నగర్‌లోని చాలా ప్రాంతాల్లో మురికి నీటి వ్యవస్థ లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మురికి నీటి వ్యవస్థ లేక అవస్థలు...
భూగర్భ మురికినీటి వ్యవస్థ ఏర్పాటుపై మీనమేషాలు లెక్కిస్తుండటంపై నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 175 గృహాలతో తిరుపతిలోనే అతిపెద్ద గృహసముదాయంగా పేరున్న... రాధేశ్యాం ప్రాంతంలో గడిచిన రెండు సంవత్సరాలుగా మురికినీటి వ్యవస్థ లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. శివ జ్యోతినగర్‌లోని ఎస్‌బీఐ శిక్షణా కేంద్రం ప్రాంతంలో ఇదే పరిస్థితి నెలకొంది. రాధేశ్యాం గృహసముదాయం నుంచి మురికినీటి కాలువలు ఏర్పాటు చేయడానికి తమ వంతు వాటాగా పది లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా నగరపాలక అధికారుల నుంచి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు స్థలంలోకి వ్యర్థ జలాలు...
మురికినీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో సమీపంలోని ప్రైవేటు స్థలంలోకి వ్యర్థ జలాలను వదులుతున్నారు. మురికినీటికి తోడు...వర్షపు నీరు చేరడంతో నివాస పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలు మురికినీటి గుంటలుగా మారి రోగాలకు నిలయాలుగా మారుతున్నాయని నగరవాసులు అంటున్నారు. దుర్గంధం వెలువడటంతో పాటు దోమలతో అనారోగ్యం బారిన పడాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఇదీ చదవండి