శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అవతారంలో కొలువుదీరిన మలయప్పస్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీజేఐకి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి స్వాగతం పలికారు. సీజేఐ ముందుగా ఆలయంలోని కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న అశ్వ వాహనసేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వాహనసేవ పూర్తయ్యేదాకా వాహన మండపంలోనే స్వామివారి సేవలో గడిపారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆయనకు తితిదే అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. జస్టిస్ ఎన్.వి.రమణతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ లలితకుమారి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరజన్ శ్రీవారిని దర్శించుకున్నారు.
అంతకు ముందు జస్టిస్ ఎన్.వి.రమణ తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ... దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు..
ఇదీ చదవండి :