కృష్ణా, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిని ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
కృష్ణా జిల్లాలో..
అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చందర్లపాడు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 296 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమచారంతో స్థానిక ఎస్సై మణికుమార్.. సిబ్బంది సహాయంతో వీరిని అరెస్ట్ చేశారు. కారు అడుగు భాగాన ఇనుప బాక్స్ ఏర్పాటు చేసి.. దానిలో మద్యం సరఫరా చేస్తున్నట్లు నందిగామ డీఎస్పీ జీవీ రమణమూర్తి తెలిపారు. అక్రమంగా ఎవరైనా మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.
కడప జిల్లాలో..
జమ్మలమడుగు పట్టణంలో అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న వైకాపా నాయకుడు బ్రహ్మానందరెడ్డిని ఆబ్కారి శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వాహనంలో 48 మద్యం సీసాలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డి తెలిపారు. మూడు కంటే ఎక్కువ సీసాలు ఉంటే కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.
చిత్తూరు జిల్లాలో..
తిరుపతి ఎల్ఎస్నగర్ క్రాస్ వద్ద ఎస్ఈబీ అధికారులు వాహనాలను తనిఖీలు చేశారు. చిత్తూరు నుంచి తిరుపతికి కారులో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 70 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి :