ఇవాలే గురుపౌర్ణమి. దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజుకు మరో ప్రత్యేకతా ఉంది. ఇవాళ రాత్రి చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ కారణంగా.. సాయంత్రం చాలా ఆలయాలు మూతపడనున్నాయి. చంద్రుడికి పట్టిన గ్రహణం విడిచాకే మళ్లీ తెరుచుకోనున్నాయి. ఇలా.. ఒకే రోజు గురుపౌర్ణమి,చంద్రగ్రహణం రావడం.. దాదాపు 149 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.
సాయంత్రం శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా.. ఈరోజు రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి బుధవారం ఉదయం 5 గంటలకు తెరుస్తారు. గ్రహణం వేళకు 6 గంటల ముందే ఇలా.. ఆలయాన్ని మూసేయడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం ఉదయం సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరుస్తారు. గ్రహణ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక పూజల అనంతరం.. 11 గంటల నుంచి సర్వదర్శనాన్ని ప్రారంభించనున్నారు.