స్మార్ట్‌సిటీ పథకంలో చోటు దక్కించుకున్న తిరుపతిలో రూ.1650 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పథకంలో చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో ఒకటి గరుడవారధి. నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిర్మాణంలో విభిన్నతలు కనిపిస్తున్నాయి. లీలామహల్ సర్కిల్, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి కూడలి, రామానుజ సమీపంలో గరుడవారధి నిర్మాణం అబ్బురపరిచే విధంగా ఉండనుంది. తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధుల వ్యయాన్ని లెక్క చేయకుండా ఒక్కో కూడలిని ఒక్కో కళాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పునాదులు పడ్డాయి. నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ప్రత్యేక చొరవతో కూడళ్లు సుందరంగా మారుతున్నాయి.
లీలామహల్ సర్కిల్ వద్ధ.. గరుడ వారధిలో రెండతస్తుల నిర్మాణం ఇక్కడ చూడొచ్చు బస్టాండ్ నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు ఎలాంటి అవాంతరం లేకుండా నేరుగా నంది కూడలికి వెళ్లేలా సమాంతరంగా వారధిని నిర్మిస్తున్నారు. కరకంబాడి నుంచి నంది కూడలికి వెళ్లేలా అదనంగా మరో అంతస్తును నిర్మించి వారధి నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం స్టీల్ బాక్సుల గడ్డర్‌లను అమర్చుతున్నారు. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటు.. చుట్టూ పచ్చదనం, సుందరీకరణ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
బస్టాండ్ సమీపంలో.. గరుడ వారధి నిర్మాణం కారణంగా బస్టాండ్ కూడలి విశాలంగా తీర్చిదిద్దుతున్నారు. రామానుజ కూడలి, లీలామహల్ కూడలి, రైల్వేస్టేషన్, బస్టాండ్‌లను అనుసంధానం చేస్తూ మూడు వరుసలుగా నిర్మిస్తున్న ఈ కూడలి అనేక విభిన్నతలకు నిలయంగా మారనుంది. తిరుమల నుంచి వచ్చే వాహనాలు నేరుగా బస్టాండ్‌కు చేరుకునేలా ప్రత్యేక డౌన్ ర్యాంపు నిర్మాణంతో వారధిపై వాహనాల ట్రాఫిక్‌ను పరిష్కరించారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, తెలుగుతల్లి విగ్రహాలతో పాటు సుందరమైన ఉద్యానవనాన్ని తలపించేలా కూడలిని సుందరీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.
రామానుజ కూడలిలో.. వలయాకారంలో నిర్మిస్తున్న రామానుజ కూడలి విశేషాలమయంగా తీర్చిదిద్దనున్నారు. రేణిగుంట నుంచి, తిరుచానూరు నుంచి వచ్చే వాహనాలకు ఎలాంటి అవాంతరం కలగకుండా తిరుమల, బస్టాండ్ వైపు నడిపించేందుకు వలయాకారాన్ని రూపొందించారు. రామానుజ కూడలిని విశాలంగా మార్ఛి. విద్యుత్తు దీపాలంకరణతో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా చేసి నగరంలోకి స్వాగతం పలికేలా తయారు చేస్తున్నారు. ఇప్పటికే త్రీడీ యానిమేషన్‌లో రూపొందించిన చిత్రాలు కనువిందు చేస్తున్నాయి.
ఇదీ చదవండి:
రిటైల్ రంగంలో రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు..ప్రత్యక్ష ఉపాధే లక్ష్యం!