Road accident in chittoor district: రెండు కుటుంబాలు.. మొత్తం ఎనిమిది మంది. మొక్కు తీర్చేందుకు తిరుపతికి బయల్దేరారు. అప్పటివరకూ ఆనందక్షణాలు.. ఆత్మీయరాగాలు! అలా సాగుతున్న వారి అధ్యాత్మిక ప్రయాణాన్ని మృత్యువు వెంటాడింది. ఒకరి వెంట ఒకరిని తీసుకెళ్లిపోయి.. వారి ఇంట పెను విషాదాన్ని నింపింది. క్షణాల్లోనే ఐదుగురు ప్రాణాలను .. తన ఒడికి చేర్చుకుంది. ఇందులో అభం శుభం తెలియని ఆరు నెలల చిన్నారి కూడా ఉంది. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగింది.
ఏం జరిగిందంటే..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. 5 నెలల చిన్నారి మొక్కు తీర్చేందుకు షిఫ్ట్ కారులో తిరుపతికి బయల్దేరింది. రేపు శ్రీవారి దర్శనం ఉండటంతో కాణిపాకంలోని సిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడ్నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఉన్న పుతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చిన్నారి సహా ఐదుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని తిరుపతి రుయాకు తరలించారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన వారిలో గోవిందరాజు(61), సురేశ్(36), శ్రీరామమూర్తి, పైడి హైమావతి (51), మీనా(30), జిషిత (6 నెలలు) ఉన్నారు. వీరిలో ఐదుగురు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమర్తికి చెందిన వారిగా గుర్తించారు. కాగా గోవిందరాజు(61) విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం వాసిగా పోలీసులు పేర్కొన్నారు.
స్థానికుల సమాచారం అందించిన వెంటనే అగ్నిప్రమాదశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే దాదాపు కారు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన కారు నెంబరును AP39 HA 4003 గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అతివేగమే ప్రమాదానికి కారణం..
ప్రమాదానికి అతివేగమే కారణం కావొచ్చని చంద్రగిరి సీఐ శ్రీనివాసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టు కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
ఇదీ చదవండి
Akhanda movie: 'అఖండ' సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్, మహేశ్‌బాబు!