తిరుపతి వేదికగా నిర్వహించిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సదస్సు.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. జోనల్ మండలి భేటీలతో రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం జీవితాల్ని నాశనం చేస్తోందని, యువతను నిర్వీర్యం చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు ముఖ్యమంత్రులు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల దర్యాప్తును 60 రోజుల్లోగా పూర్తి చేయాలన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని చెప్పారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, ఆ నేరాలను ఏ మాత్రమూ ఉపేక్షించొద్దని నిర్దేశించారు. ‘ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ సవరణల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలివ్వాలి. విచారణల వేగవంతానికి రాష్ట్రాలు ‘డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్’ స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ప్రధాని మోదీ చొరవతో ఇప్పటికే జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాయని అమిత్‌షా చెప్పారు. ప్రతి రాష్ట్రం కనీసం ఒక్క ఫోరెన్సిక్ సైన్స్ కళాశాలనైనా ఏర్పాటు చేయాలని, వాటిలో సిలబస్ స్థానిక భాషలో ఉండాలన్నారు. ఈ భేటీతో 51 పెండింగ్ సమస్యలకు 40 పరిష్కారమైనట్లు ట్వీట్ చేశారు. ఈ సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్‌కుమార్, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఇంఛార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, అండమాన్ నికోబార్ ఎల్‌జీ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ సమావేశానికి హాజరయ్యారు.
'కరోనా రెండో డోసు టీకాను వేగవంతం చేసేందుకు వ్యాక్సిన్ పురోగతిని సీఎంలు పర్యవేక్షించాలి. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాలను సవరిస్తాం. రాష్ట్రాలు కూడా తమ అభిప్రాయాలు చెప్పాలి. డ్రగ్స్ నియంత్రణకు సీఎంలు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయా కేసులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలి. దేశాభివృద్ధిలో గిరిజనుల పాత్ర ఎంతో ఉంది. నవంబర్ 15ను జనజాతీయ గౌరవ్ దివస్‌గా పాటించాలి.' - అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి
సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం... రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదన్నారు. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదన్నారు. పోలవరం ఖర్చు నిర్ధరణలో 2013- 2014 ధరల సూచీతో ఏపీకి అన్యాయం జరుగుతోందని, పోలవరం ఖర్చుపై విభజన చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చలేదని సమావేశం దృష్టికి తెచ్చారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించి.. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోతలు విధించటం సరికాదన్నారు. రుణాలపై కోతల అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత లేదని, సవరణలు చేయాల్సిన అవసరముందని సీఎం జగన్ అభిప్రాయ పడ్డారు.
సామరస్యంగా పరిష్కరించుకుంటాం- తెలంగాణ హోంమంత్రి
'సాగు వృద్ధి, రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాదికి రూ.15 వేల కోట్ల చొప్పున రైతు బంధు సాయం ఇస్తున్నాం. నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.ప్రాథమిక రంగంలో రాష్ట్రం అధిక వృద్ధి నమోదు చేసింది. నేర నియంత్రణలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. చిన్నారులు, మహిళలపై దాడుల విషయంలో పటిష్ట చర్యలు చేపట్టాం. తెలుగురాష్ట్రాల మధ్య చాలావరకు విభజనాంశాలు పరిష్కారమయ్యాయి. కొన్ని అంశాలు కోర్టులు, ఇతరచోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీతో సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటాం' - మహమూద్ అలీ, తెలంగాణ హోంమంత్రి
దక్షిణాది ప్రాంతీయ మండలి భేటీలో పాల్గొన్న వారికి ఏపీ ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. తర్వాత తాజ్ హోటల్ నుంచి ప్రముఖలు పయనమయ్యారు. అయితే హోంమంత్రి అమిత్ షా...ఈ రాత్రికి తాజ్ హోటల్‌లోనే బస చేయనున్నారు. రేపు ఉదయం 10 గం.కు రాష్ట్ర భాజపా నేతలతో ఆయన భేటీ కానున్నారు.
ఇదీ చదవండి
SZC Meeting: రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు: సీఎం జగన్