తిరుపతిలో కలకలం రేపిన 'సూట్ కేసులో మృతదేహం కాల్చివేత' కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రుయా ఆసుప్రతి ఆవరణలో ఈ నెల 23న కాలిన మృతదేహం సంఘటనలో పలు ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. రుయా ఆసుపత్రిలో లభ్యమైన మృతదేహం.. సాఫ్ట్ వేర్ఇంజనీర్ భువనేశ్వరిదిగా పోలీసులు గుర్తించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రామసముద్రానికి చెందిన భువనేశ్వరిని ప్రేమించి పెళ్లిచేసుకొన్న ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డి హత్య చేసి మృతదేహాన్ని కాల్చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
భార్యపై అనుమానంతో..
పోలీసుల సమాచారం మేరకు భువనేశ్వరి టీసీఎస్ సంస్థ హైదరాబాద్ శాఖలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించడంతో మూడు నెలల క్రితం భర్తతో కలిసి భువనేశ్వరి తిరుపతి వచ్చారు. నగరంలోని డీబీఆర్ ఆసుపత్రి రహదారిలోని పద్మావతి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భువనేశ్వరిపై అనుమానం వచ్చిన శ్రీకాంత్ రెడ్డి తాము నివాసం ఉంటున్న ఇంట్లోనే ఆమెను హతమార్చారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిందని.. ఆసుపత్రి యాజమాన్యం అంత్యక్రియలు నిర్వహించిందని భువనేశ్వరి కుటుంబసభ్యులను నమ్మించారు. అనుమానం వచ్చిన భువనేశ్వరి సమీప బంధువు ఓ పోలీసు అధికారి.. తిరుపతి పోలీసులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించడంతో శ్రీకాంత్ రెడ్డి ఘాతుకం వెలుగులోకి వచ్చింది.
కూపీ లాగితే..
ఆపార్ట్మెంట్ సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో శ్రీకాంత్ రెడ్డి ఘాతుకం వెలుగు చూసింది. కొత్త ఎర్రటి సూటుకేసు తీసుకురావడం, బయటకు తీసుకెళ్లడం దృశ్యాల ఆధారంగా కూపీ లాగిన పోలీసులు భువనేశ్వరి మృతి వెనుక ఉన్న మిస్టరీ గుట్టు విప్పారు. శ్రీకాంత్ రెడ్డికి సహకరించిన టాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో నిజాలు బయటపడ్డాయి. భార్యను. శ్రీకాంత్ రెడ్డి హతమార్చినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు పరారీలో ఉన్న శ్రీకాంతరెడ్డి కోసం రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి:
UNKNOWN DEAD BODY: రుయా ఆస్పత్రి ఆవరణలో కాలిన మృతదేహం కలకలం