వాస్తవానికి.. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్‌నెట్ కాలింగ్‌కు మంచి వ్యాపారం ఉంది. ఓ సర్వే ప్రకారం 2025 నాటికి వీఓఐపీ కాలింగ్ అంతర్జాతీయంగా 55 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను సొంతం చేసుకుంటుందని అంచనా. వాయిస్ కాలింగ్ కోసం సోలార్ విండ్స్, 3-సీఎక్స్, జోయ్ పెర్, స్కైప్, ఎకిగా, జిట్సీ వంటి టూల్స్‌ని ఎక్కువగా వాడుతున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. భారత్ విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న దేశాల జాబితాలో 2వ స్థానంలో నిలుస్తోంది. 2018 నాటికే భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారులు 40 కోట్లకు చేరుకున్నారు. ఈ సంఖ్య రానురాను మరింత పెరుగుతుందని గణాంకాలు తెలుపుతున్నాయి. వీటితో పాటే..... సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది.
లక్షల కోట్లలో నష్టం
భారత్‌లో ఏటా సుమారుగా 27వేల సైబర్ నేరాల కేసులు నమోదవుతుండగా... కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అంచనా ప్రకారం... ఒక 2019లోనే సైబర్ నేరాల వల్ల దేశంలో 1.25 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేరాల్లో అత్యధికంగా బ్యాకింగ్‌కు సంబంధించిన మోసాలు జరుగుతుండగా, ఫేక్ కాలింగ్, ఎనానిమస్ చాట్, స్పామ్ చాట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ట్రాయ్ చర్యలు
ఈ తరహా నేరాల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా.. 2019లో కేరళ పోలీసులు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్ పేరుతో డార్క్ నెట్ నియంత్రించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టోర్, I 2 P వంటి డీప్ వెబ్, డార్క్ వెబ్ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా నేరస్థుల కదలికలు గమనిస్తున్నారు. అందుకోసం ఇజ్రాయెల్‌లో శిక్షణ పొందిన ఓ బృందాన్ని ప్రత్యేకంగా నియమించారు. ఈ వ్యవస్థ ద్వారా జైళ్లలో ఉన్న నేరస్థులతో పాటు.. బయట ఉన్న నేరగాళ్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
రానురాను నేరాలు అధికం కావడం, ప్రముఖుల నుంచి సామాన్యులు వరకు ఇబ్బందులు పడుతుండటంతో టెలికాం సంబంధిత అంశాలను పర్యవేక్షించే ట్రాయ్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 2017లో ఇంటర్ నెట్ కాలింగ్‌కు సంబంధించిన నియమ నిబంధనలను కఠినతరం చేస్తూ.. కొన్ని సవరణలతో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే కచ్చితంగా తమ నిబంధనలను పాటించి తీరాల్సిందనే ఆదేశాలను జారీ చేసింది.
కఠిన నియమ నిబంధనలు
ఏ ఇంటర్ నెట్ కాలింగ్ సర్వీస్ ప్రొవైడర్ కూడా పబ్లిక్ సర్వీస్ టెలిఫోన్ నెట్ వర్క్‌లతో అనుసంధానమై ఉండకూడదనే అంశాన్ని కఠినతరం చేసింది కేంద్రప్రభుత్వం. వినియోగదారులు వాడుతున్న డివైజ్‌లు, సేవలు పొందుతున్న ప్రాంతాల ఆధారంగా ఇంటర్ నెట్ కాలింగ్ సర్వీస్ ప్రొవైడర్లు పర్యవేక్షణ సాగించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ముందుగా ఆయా ప్రొవైడర్లు ఇంటర్ నెట్ టెలిఫోనీ సర్వీస్ ప్రొవైడర్ -ఐటీఎస్‌పీ లైసెన్సులపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే విదేశీ సర్వీస్ ప్రొవైడర్లను దేశంలో అనుమతించే విధంగా నిబంధనలను ట్రాయ్ కట్టుదిట్టం చేసింది. అయినా వీఓఐపీ సేవలు దుర్వినియోగం అవుతూనే ఉన్నాయి.
ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, నిబంధనలు ఎంత కట్టుదిట్టం చేసినా ఏదో రకంగా నేరాలు జరుగుతుంటాయంటున్న నిపుణులు... ఇంటర్‌నెట్ వినియోగంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు. నెట్ కాలింగ్, ఆన్‌లైన్ చాటింగ్ ఇతర సర్వీస్ ప్రొవైడర్ల పేరుతో కుప్పలుతెప్పలుగా పుట్టుకువస్తున్న యాప్‌లు, ఫీచర్లపై అవగాహనతో ఉండాలంటున్నారు. సైబర్ ఫ్రాడ్, ఎనానిమస్ కాలింగ్‌ను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని.. భద్రత, గోప్యత విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్న క్రమంలో మహిళలు, యువతులు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు హామీ ఇస్తున్నారు.
ప్రభుత్వాలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ఆన్‌లైన్ యాప్‌లపై మరింత దృష్టి సారించాలి. నిర్దుష్ట సర్వీస్ ప్రొవెైడర్లనే అందుబాటులోకి తీసుకురావటంతో పాటు.. వాటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణాధికారం కలిగి ఉన్నప్పుడే... ఈ ఆన్‌లైన్ మోసాలు, అంతర్జాల ఆగడాలకు అట్టుకట్ట పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: