ఎర్రచందనం స్మగ్లింగ్‌కి అడ్డాగా మారిన శేషాచలం అడవుల్లో.. తాజాగా వెలుగుచూసిన గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఏడాదిన్నరగా గుట్టుచప్పుడు కాకుండా శేషాచలం అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం సాగుతున్న తవ్వకాలు వెలుగు చూశాయి. రెండు రోజుల క్రితం అలిపిరి పోలీసులకు మంగళం ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు విస్మయం కలిగించే వాస్తవాలు తెలిశాయి.
తిరుమల శ్రీవారి కొండ కింద భాగంలో గుప్తనిధులు ఉన్నాయని ఓ స్వామీజీ చెప్పిన సమాచారంతో.. ఏడాదిన్నరగా శేషాచలం అడవుల్లో ఏడుగురు సభ్యుల ముఠా సొరంగాన్ని తవ్వుతున్నట్లు తెలుసుకున్నారు. నిందితుడుతో సహా అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పోలీసులు అక్కడ కనిపించిన భారీ సొరంగాన్ని చూసి అవాక్కయ్యారు. ఏకంగా.. 80 అడుగుల మేర ఆ సొరంగం ఉంది మరి.
అనకాపల్లికి చెందిన పెయింటర్ మంకునాయుడు భార్యను వదిలేసి 2014లో తిరుపతికి మకాం మార్చాడు. ఎంఆర్ పల్లెలో ఉంటూ కూలీల మేస్త్రీగా పనిచేస్తూనే గుప్త నిధుల కోసం గాలించే వాడు. ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన రామయ్యస్వామితో పరిచయం ఏర్పడింది. కొన్ని పురాతన రాగిరేకులను బట్టి శేషాచలం అడవుల్లో గుప్త నిధి ఉందని రామయ్యస్వామి గుర్తించాడు. అప్పట్నుంచి మంకునాయుడు ఆరుగురు కూలీలతో కలిసి తవ్వకాలు ప్రారంభించాడు.
విషయం బయటకు పొక్కకుండా ఉండేలా మూడు నెలల వ్యవధితో గోప్యంగా తవ్వుతూ... వచ్చారు. ఇలా మంకునాయుడు బృందం 80 అడుగుల సొరంగాన్ని తవ్వింది. నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేర తవ్వాల్సి ఉందట. ఈ నేపథ్యంలో తవ్వకాలు సాగించేందుకు శుక్రవారం రాత్రి మంకునాయుడు కూలీలతో బయలుదేరాడు. మంగళం వెంకటేశ్వర కాలనీ సమీపంలో వీరు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధుల తవ్వకాలకు వచ్చినట్లు విచారణలో వారు అంగీకరించారు. వారిచ్చిన సమాచారంతో మరో నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని తీసుకుని ఘటనా స్థలికి వెళ్ళిన పోలీసులు అక్కడి పరిస్థితులు గమనించారు. మంగళం నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల మేర శేషాచలం అటవీ ప్రాంతంలో కొండపైకి నడిచిన తర్వాత... ఈ భారీ సొరంగాన్ని పోలీసులు గుర్తించారు. మరో 40 అడుగుల తవ్వితే రెండు గదులు వస్తాయని వాటిలో నిధులు ఉన్నాయని స్వామీజీ తమను నమ్మించి నట్లు నిందితుడు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత వివరాలను వెల్లడిస్తామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు