తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. వైకాపా ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. గుడిలో ప్రమాణాలకు సిద్ధమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యేపై తెదేపా నేత నల్లమిల్లి మైనింగ్ సహా పలు ఆరోపణలు గుప్పించారు. స్పందించిన శాసనసభ్యుడు సూర్యనారాయణరెడ్డి.. బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాల్ చేశారు. ప్రమాణానికి తాను సిద్ధమేనన్న నల్లమిల్లి.... ఎమ్మెల్యే బహిరంగ చర్చకు రావాలన్నారు. ఈ పరిస్థితుల్లో అనపర్తి రాజకీయం కొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతోంది.
నాయకుల ప్రమాణాలతో అప్రమత్తమైన పోలీసులు.. ఉద్రిక్తతలు రేకెత్తకుండా చర్యలు చేపట్టారు. అనపర్తి, బిక్కవోలు మండలాల్లో 144 సెక్షన్, పోలీసు చట్టం 30 అమల్లోకి తెచ్చారు. రెండు మండలాల్లో బందోబస్తు పెంచడం సహా పలువురు వైకాపా, తెదేపా నాయకుల్ని గృహ నిర్భందం చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వెంట ఐదుగురు చొప్పున అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు గుడిలో ప్రమాణాలకు సిద్ధం కావడం ఆసక్తి రేపుతోంది.
ఇవీ చూడండి: