రాజమహేంద్రవరం బొమ్మూరు మహిళా ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్న ఒడిషా యువతులను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి కలిశారు. వారి గురించి వివరాలు రాబట్టేందుకు ఇంకా విచారించాల్సి ఉందని ఆమె చెప్పారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఒడిషా నుంచి ముంబాయికి తరలిస్తుండగా 15 మంది యువతులు, ఇద్దరు మహిళలను రాజమహేంద్రవరంలో పోలీసులు పట్టుకున్నారు. వీరిని తొలుత ఛైల్డ్ లైన్‌కు, తర్వాత బొమ్మూరు మహిళా ప్రాంగణానికి తరలించారు. ముంబయిలో ఉపాధి కోసం వెళ్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. అయితే మరో కారణం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. యువతులంతా ఒకే వయసువారు కావడం, వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అనుమానించాల్సి వస్తోందని రాజకుమారి అన్నారు. మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవడం, మానప్రాణాలకు రక్షణగా మహిళా కమిషన్ పని చేస్తుందని చెప్పారు. వీరి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అలాగే ఒడిషా ప్రభుత్వంతోనూ మాట్లాడతామని చెప్పారు. అప్పటివరకూ మహిళా ప్రాంగణంలోనే రక్షణ, వసతి కల్పిస్తామని రాజకుమారి తెలిపారు.
ఇవి చూడండి....