Amalapuram Case: కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్లలో.. మంత్రి విశ్వరూప్ అనుచరుల్లో నలుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. సత్యరుషి, వాసంశెట్టి సుభాష్, మట్టపర్తి మురళీకృష్ణ, మట్టపర్తి రఘులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే అరెస్టై, A-222గా ఉన్న చీకట్ల వీరవెంకట సత్యప్రసాద్ వాంగ్మూలంతో ఈ నలుగురిపై కేసు పెట్టారు. తాజాగా పోలీసులు కేసు నమోదు చేసిన ఈ నలుగురు నాయకులు, వైకాపాలో క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారం. వీరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
అమలాపురం అల్లర్లలో మొత్తం 258 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇప్పటివరకు 142 మందిని అరెస్టు చేశారు. కాగా.. 116 మంది పరారీలో ఉన్నారు.
Anyam sai in Amalapuram Police Custody: కోనసీమ జిల్లా అమలాపురంలో చెలరేగిన అల్లర్లకు కీలక సూత్రదారిగా భావిస్తోన్న వైకాపా కార్యకర్త అన్యం సాయిని అమలాపురం పోలీసులు అదుపులో తీసుకున్నారు. మంత్రి విశ్వరూప్ అనుచరుడిగా ఉన్న అన్యం సాయి.. ఈనెల 20న కోనసీమ సాధన సమితి ఆందోళనలో పాల్గొన్నారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద ఒంటిపై సాయి పెట్రోల్ పోసుకున్నాడు. అతనిపై గతంలోనే పోలీసులు రౌడీషీట్ తెరిచారు. తాజాగా.. అమలాపురంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అల్లర్లలో అన్యం సాయి పాత్రపై విచారిస్తున్నారు.
Tension at Amalapuram: కోనసీమ జిల్లా అమలాపురం ఆందోళనలతో అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.
సెక్షన్ 144, 30 పోలీస్ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
'కోనసీమ ముద్దు - వేరే పేరు వద్దు' అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళకారులు అన్ని వైపుల నుంచి పట్టణంలోకి చొచ్చుకొచ్చారు. బస్టాండ్‌తో పాటు ముమ్మిడివరం వైపు నుంచి గడియారం స్తంభం వద్దకు ప్రదర్శనగా చేరుకున్నారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు యత్నించారు. లాఠీలతో చెదరగొట్టారు. అయినా నిరసనకారులు వెనకడుగు వెయ్యలేదు. సమయం గడిచేకొద్దీ వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
ఇవీ చదవండి :