తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో నూతనంగా హోల్సేల్ ఉల్లి మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్కెట్లో పనిచేసే విషయంపై రాజమహేంద్రవరం సీవీ మార్కెట్, దివాన్ చెరువు జట్టు కూలీ సంఘాల మధ్య నాలుగు రోజులుగా వివాదం జరుగుతోంది. సీవీ మార్కెట్ కూలీలు దివాన్ చెరువు వచ్చి స్థానిక జట్టు కూలీల ఉల్లి ఎగుమతి, దిగుమతి వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు.
40 ఏళ్ల క్రితమే జట్లు
ఈ వివాదంపై ఇరు వర్గాల సభ్యులు చర్చలు జరిపారు. అయినా సమస్య కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం దివాన్ చెరువు జట్టు కూలీలు సమావేశం నిర్వహించారు. 40 ఏళ్ల క్రితం దివాన్ చెరువులో జుట్టు కూలీల సంఘాలు ఏర్పడ్డాయన్నారు. దివాన్ చెరువులో వివిధ రకాల పండ్ల తోటలు అధికంగా ఉండేవని, అప్పుడు అందరికీ చేతినిండా పని ఉండేదని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరగిన కారణంగా.. తోటలు తొలగించారన్నారు. ప్రస్తుతం పనుల్లేక అవస్థలు పడుతున్నామన్నారు. ఈ సమయంలో సీవీ మార్కెట్ హోల్సేల్ దుకాణాలు దివాన్ చెరువు వైపు వస్తుండడంతో పనులు దొరుకుతాయని ఆనందించామన్నారు.
పోలీసులకు విజ్ఞప్తి
ఉల్లి మార్కెట్కు సంబంధించి రాజమహేంద్రవరం సీవీ మార్కెట్ జట్టు కూలీలు తమ ఉపాధికి గండికొడుతున్నారని దివాన్ చెరువు కూలీలు వాపోయారు. స్థానిక జట్టు కూలీలే ఎగుమతి, దిగుమతి చేస్తామని ఇంకా అవసరమైతే అప్పుడు ఇతరులకు అవకాశం ఇస్తామన్నారు. అలా కుదరదని తమపై రాజమహేంద్రవం జట్లు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, వారి నుంచి తమను రక్షించాలని బొమ్మూరు పోలీసులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఉపాధి లేక స్థానిక కుటుంబాలు ఇబ్బందిపడుతున్నారని, ఈ విషయంలో కూలీలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని గ్రామ పెద్దలు అంటున్నారు.
ఇదీ చదవండి: