కరోనా కల్లోలం సృష్టిస్తుండటం, ఆంక్షలతో అనేక మంది వివాహాలను వాయిదా వేసుకుంటున్నారు. అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని సన్నిధిలో గురువారం తెల్లవారుజామున అనేక వివాహాలు జరగాల్సి ఉంది. అనేక మంది వసతిసముదాయాలు, వివాహ మండపాలు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నారు. మరికొంత మంది స్వామి సన్నిధిలో వివాహానికి సన్నద్ధమయ్యారు. ఇలా 20-25 వివాహాలు జరగవచ్చని అంచనా వేశారు. అయితే కరోనా భయాందోళనకు గురి చేస్తుండటం, ఆంక్షలతో స్వామి సన్నిధిలో వివాహాలు చేసుకోవాలనుకున్న అనేక మంది వాయిదా వేసుకున్నారు. తాము వాయిదా వేసుకున్నామని, సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత ముహూర్తం నిర్ణయించుకుంటామని, ఆ సమయానికి తాము చేసుకున్న ముందస్తు రిజర్వేషన్ కేటాయించాలని అధికారులకు అనేక మంది సమాచారం ఇచ్చారు. ఇలా ప్రస్తుతానికి 50 శాతానికి పైగా వివాహాలు వాయిదా వేసుకోవడం, సాధారణంగా వారి స్వస్థలాల్లోనే చేసుకుంటున్నారు. అన్నవరంలో గత నెల 27 వరకు 132 వివాహాలకు ముందస్తు రిజర్వేషన్ చేసుకోగా ఆయా ముహూర్తాలకు కొండపై సుమారు 20-30 శాతమే పెళ్లిళ్లవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
20 మందికే అనుమతి
పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వివాహాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇప్పటికే అనేక మంది ముహూర్తాలు నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకోవడంతో 20 మంది మాత్రమే హాజరై, నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వివాహాలు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అన్నవరం కొండపై కూడా వివాహాలు చేసుకునేవారికి కేవలం 20 మందికి మాత్రమే కలెక్టర్ అనుమతిస్తూ ఆదేశాలిచ్చారని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ… తెదేపా నేత ఇంటిపై వైకాపా నేతల దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు