Sankranti cockfights: సంక్రాంతికి కోడి పందేల నిర్వహణ ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పుంజును పెంచి పోషించి బరిలోకి దింపే తంతు వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. బరిలో జరిగే కోడి పందెం 2 నుంచి 10నిమిషాలు లోపే అయినా.. తగ్గేదే లే అంటూ ప్రత్యర్థిపై విరుచుకుపడే తీరు వీటి సొంతం. గ్రామీణులకు సంప్రదాయంగా.. పందెం రాయుళ్లకు ఉత్కంఠ భరిత జూదంగా.. చూసేవాళ్లకు సరదాల సంబరమైన పందేనికి.. కోళ్లను ఎలా సిద్ధం చేస్తారనేదీ ఆసక్తికరమే. 2 నెలల వయసు నుంచి ప్రత్యేక శిక్షణ మొదలుపెట్టి 18 నెలలొచ్చాక పోటీకి దింపుతారు. ఈ లోపు ఒక్కో కోడి పెంపకానికి అయ్యే ఖర్చు రోజుకు 100రూపాయల నుంచి 500వరకూ ఉంటుంది.
ఒక్కో శిబిరంలో 200 వరకు పుంజులు
స్థలం లీజుకు తీసుకొని.. ఒక్కో శిబిరంలో 200 వరకూ పుంజులు పెంచుతారు. ఏడాదికి 6లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఖర్చు చేస్తారు. వీటి ఆలనాపాలనా చూసేందుకు ముగ్గురు ఉంటారు. వీటికి శిక్షణ మిలటరీ స్థాయిలో ఉంటుంది. ఉదయం 5 గంటలకు పుంజులను బయటకు తీసి కాసేపు చల్లగాలి శ్వాస తీసుకునేలా చుట్టూ వలయంగా ఏర్పాటు చేసి.. అందులో వదిలిపెట్టి పరిగెత్తిస్తారు. పందెం కోళ్లను ఎండలో కట్టేసి ఈకలు కొంత విడిపోతున్నప్పుడు నీడలోకి తీసుకొస్తారు. ఎంత సేపు పోరాడినా ఆయాసం రాకుండా కోడి చేత ఈత సాధన చేయిస్తారు. కొవ్వు చేరకుండా యూకలిప్టస్, కుంకుడు, వెదురు ఆకులు నీటిలో వేసి బాగా మరగబెట్టి చల్లబరిచాక పుంజుకు స్నానం చేయిస్తారు. దీన్నే నీరుపోతలు అంటారు. కఫం పట్టకుండా, శరీరం గట్టి పడేందుకు ఆవిరి పట్టడం లాంటివి చేస్తారు. పెనంమీద సారా లేదా చీప్ లిక్కర్ వేసి దాన్నుంచి వచ్చే ఆవిరిని పట్టిస్తారు. దీనివల్ల కోడి ఒళ్లు గట్టిపడుతుందని నమ్మకం. పోటీలో దెబ్బ తగిలినా తట్టుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాళ్లపై ఒకేచోట నిల్చుని ఉంటే పాదాలపై మొత్తం బరువు పడుతుంది. దీనివల్ల పుంజు చురుకుగా కదల్లేదు. అందువల్లే ఒకేచోట ఉంచకుండా నడక-పరుగు మధ్యలో ఉండేలా 2 నుంచి 4 నిమిషాలపాటు ఇసుకలో నడిపిస్తారు. నైపుణ్యం కలిగిన శిక్షకులతో 2 పూటలా మసాజ్ చేయిస్తారు. చురుగ్గా పరిగెత్తడంపై సాధన చేయిస్తారు. చలికాలంలో కోళ్లకు గురకలు, తెగుళ్లు రాకుండా వ్యాక్సిన్లు ఇప్పిస్తారు. పుంజు సామర్థ్యం తెలుసుకునేందుకు తరచూ ట్రయల్ పందేలు నిర్వహిస్తుంటారు. పుంజులపై భారీగా పెట్టుబడులు పెట్టి సంక్రాంతి పండుగకు రాబట్టుకోవాలని కొందరు, ప్రతిష్ట కోసం మరికొందరు శ్రమిస్తారు.
ఆ బ్రీడ్‌నే ఎక్కువగా పెంచుతారు
కోడి జాతిని బట్టి దానిలో పోరాట గుణాన్ని అంచనా వేస్తారు. పోటీల్లో గెలిచే పుంజుల బ్రీడ్‌నే ఎక్కువగా వినియోగిస్తుంటారు. థాయ్‌లాండ్, పెరు దేశాల నుంచే కాక తమిళనాడులోని సేలం, కోయంబత్తూరు నుంచి ఎక్కువగా బ్రీడ్ తీసుకొస్తున్నారు. ఆ బ్రీడ్‌ను ఇక్కడ బాగా డిమాండ్‌లో ఉన్న బ్రీడ్‌ను కలిపి కొత్త వాటిని సృష్టిస్తున్నారు. కోడి పుట్టిన 3 నెలల నాటికి దాని ఎత్తు, రంగు,. చురుకుదనం లాంటి అంశాలను గమనించి వాటిలో పందానికి పనికొస్తాయనుకునే వాటిని మిగతా కోళ్లనుంచి వేరు చేస్తారు. జవ్వగోధుములూ, వడ్లమెరికల్లాంటివే కాకుండా బాదంపప్పు, పిస్తా, అక్రూట్, కిస్మిస్, కుంకుమపువ్వు, సోంపు, మిరియాలు, సొంఠి, చేదుజీలకర్ర, మేడిపళ్లతో కలిపిన మిశ్రమాన్ని పందెం కోళ్లకు తినిపిస్తారు. ఇంకా మేక ఎముకల పొడి, ఉడకబెట్టిన కోడిగుడ్లూ, అప్పుడప్పుడూ తినిపిస్తారు. బలం కోసం కొంతమంది కోళ్లతో బీకాంప్లెక్స్ బిల్లల్ని తినిపిస్తారు. ఇంకొందరు ఇంజెక్షన్లు వేస్తారు. కోడి ఒంట్లో కొవ్వు కాకుండా బలం మాత్రమే పెరగాలన్నది వీటి ఉద్దేశం. అన్నింటికీ మించి పందెం కోళ్లకు బ్రహ్మచర్యం తప్పనిసరి.
డబ్బే డబ్బు..
కోడిపందాలతో సంక్రాంతి వేళ కోట్ల రూపాయలు చేతులు మారతాయి. గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందాల నిర్వహణ ఎంతో ప్రతిష్ఠాత్మకం. పండుగ 3 రోజులూ సందడే సందడి. కత్తిపందాలు, అస్లీ, డింకీ ఇలా వివిధ విభాగాల్లో కోడి పందాలు నిర్వహిస్తారు. 3,4 ఎకరాల స్థలంలో టెంట్లు వేసి పందాలు నిర్వహిస్తారు. చీకటి పడితే ఫ్లడ్లైట్లు వేసి మరీ జరుపుతారు. జనం వేల సంఖ్యలో హాజరవుతారు. డబ్బున్న వారు లక్షలు, కోట్లలో ఆడుతుంటే... పైపందేల పేరుతో సామాన్యుల జేబులు ఖాళీ చేసుకుంటారు. పోలీసులకు తెలియకుండా జాగ్రత్తలూ తీసుకుంటారు. పోలీసులకు సమాచారం వెళ్లినా ఆపై రాజకీయ ఒత్తిళ్లు ఉండనే ఉంటాయి. కోడిపందాలు ఆడే వారిపై కేసులు అంతంత మాత్రమే. నిందితులకు సొంతపూచీకత్తుపై విడుదలయ్యే వెసులుబాటు ఉంది. కోర్టు దాకా వెళ్లినా వందల రూపాయల జరిమానాతో కేసు తేలిపోతుంది.
ఇదీ చదవండి:
Perni Nani On Cinema Tickets: సినిమా టికెట్ల వ్యవహారం తప్ప ఇంకేం లేదా?: పేర్ని నాని