Somu Veerraju: ప్రభుత్వ తప్పిదాల వల్లే కోనసీమలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అంబేద్కర్ పేరుతో ఇలాంటివి జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోనసీమలో మంత్రి ఇంటిని దహనం చేస్తే ఫైరింజన్ పంపించే దిక్కు కూడా లేదని దుయ్యబట్టారు. కుల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుమలలో స్వామివారికి నిత్యం జరిగే కార్యక్రమాలను నిలిపివేశారని, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారని సోమువీర్రాజు ధ్వజమెత్తారు. కర్నూలులో జిన్నా టవర్ పేరును అబ్దుల్ కలాం టవర్గా మార్చాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగే ఉప ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యవహారశైలిని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. అధికారపక్షం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై భాజపా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. సోము వీర్రాజు సమక్షంలో ఆత్మకూరుకు చెందిన బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి భాజపాలో చేరారు. సోము వీర్రాజు కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవీ చదవండి: