Rains alerts to AP: దక్షిణ అండమాన్ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తర్వాత రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని తెలిపింది. ఇప్పటికే..శ్రీలంక తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలాచోట్ల ఆదివారం నుంచి రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.(weather updates of AP) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.. డిసెంబరు 1వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
అప్రమత్తమైన చిత్తూరు జిల్లా యంత్రాంగం..
వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం ఉందని కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాజ్‌వేలు దాటొద్దని కోరారు. జిల్లాలో నేడు విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.
ఇదీ చదవండి:
WATER DIVERTED TO CANAL IN ATMAKUR : ఆ చెరువుకు గండి కొట్టిన అధికారులు