ఎమ్మెల్యే కోటంరెడ్డి తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు కోటంరెడ్డిని అరెస్టు చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కోటంరెడ్డిని నెల్లూరు గ్రామీణ పీఎస్‌కు తరలించారు. రాత్రి అరెస్ట్ చేసేందుకు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ దగ్గరున్న ఎమ్మెల్యే నివాసానికి పోలీసులు చేరుకోవడంతో హడావుడి నెలకొంది. రూరల్ డీఎస్పీ రాఘవ రెడ్డి తో పాటు పలువురు సీఐలు, ఎస్ఐలు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి కోటంరెడ్డితో చర్చించారు. కోటంరెడ్డి అనుచరులు నివాసానికి చేరుకున్నారు. కొంతసేపు ఎమ్మెల్యే నివాసం వద్ద హైడ్రామా నడిచింది.
పోలీసు స్టేషన్లో హైడ్రామా
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రాత్రిపూట ఇంటికి పోలీసులు రావడం ఏంటని శ్రీకాంత్ రెడ్డి భార్య పోలీసులపై 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి వచ్చి తలుపు తీసి పోలీసులు లోపల ప్రవేశించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా ఇంట్లోకి చొరబడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉంటానన్నారు.
ఇదీ చదవండి:నెల్లూరు ఘటనపై సీఎం ఆరా... చట్టపర చర్యలకు ఆదేశం..!