జిల్లాలో కొవిడ్ మరణాలు, ఆస్పత్రిలో సదుపాయాలపై మంత్రి గౌతంరెడ్డి వైద్యులతో మేకపాటి చర్చించారు. ఆక్సిజన్ కొరత వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని జీజీహెచ్ సూపరింటెండెంట్, డీంహెచ్వో మంత్రి తెలిపారు. జీజీహెచ్ అవసరాలను బట్టి నిరంతర ఆక్సిజన్ సరఫరా అందించేందుకూ సిద్ధమని మంత్రి హామీ ఇచ్చారు. ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
జీజీహెచ్ పనితీరుపై మంత్రి ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడడంలో నిర్లక్ష్య వైఖరి సరికాదని హితవు పలికారు. కొవిడ్ రోగులకు అందించే చికిత్స విధానం, ఆక్సిజన్ సరఫరా సమస్యలపై సుతిమెత్తగా మందలించారు. ప్రభుత్వ పరంగా ఏం కావాలన్నా చెప్పాలని... అందరి ప్రాణాలను రక్షించాలని మంత్రి సూచించారు. ఆక్సిజన్ కొరత, ఆస్పత్రి సామర్థ్యానికి మించిన రోగుల్ని చేర్చుకోవడం కారణాలని మంత్రికి జీజీహెచ్ వైద్యులు వివరించారు.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒకే విధమైన పని చేస్తున్న నర్సులకు వేర్వేరు జీతాలు ఇస్తున్నారని స్టాఫ్ నర్సులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నర్సులు, గత 3 ఏళ్లుగా పనిచేస్తున్న వారి జీతాలు వేరుగా ఉన్నాయని, జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. వివరాలు పరిశీలించి సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హామీ ఇచ్చారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ వసతులను మరింత పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... 'సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా...'