PEOPLE FEAR ON KANDALERU SAFETY: నెల్లూరు జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కండలేరు జలాశయం మట్టి కట్ట కొన్ని చోట్ల బలహీనంగా మారింది. భారీ వర్షాలకు కుమ్మరిగుంట సమీపంలో 7వ కిలోమీటర్ దగ్గర కట్ట మట్టి జారిపోయింది. మట్టికట్టపై ఏళ్ల తరబడి జంగిల్ క్లియరెన్స్ పనులు చేయలేదు. రివిటీమింట్ పనులు పట్టించుకోలేదు. చిల్ల చెట్లు ఏపుగా పెరిగాయి. కొన్నిచోట్ల వేర్లు కట్టలోపలికి చొచ్చుకుపోయాయి. జీపు ట్రాక్ గుంతలమయంగా మారింది. కట్టపై నుంచి వర్షపునీరు కిందకు పోయేందుకు ఏర్పాటు చేసిన సూట్లు దెబ్బతిన్నాయి. నీరు పోయే మార్గానికి అడ్డంకులు తొలగించక పోవడంతో పైనుంచి నీరు పారి కట్ట బలహీన పడింది.
''అధికారులు మాత్రం కండలేరు కట్ట భద్రతపై అనుమానాలు వద్దని చెబుతున్నారు. జలాశయం సామర్ధ్యం 68 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం టీఎంసీలు నీరు ఉంది. మట్టిజారిన ప్రాంతం నీటి మట్టం కంటే ఎత్తులో ఉందని.. ఇసుక బస్తాలతో మట్టి జారకుండా తాత్కాలిక మరమ్మతులు చేపడతామని తెలిపారు.'' - హరినారాయణరెడ్డి, కండలేరు ఎస్ఈ
ఇదే సమయంలో కండలేరు నుంచి నల్లవాగు మీదగా పెన్నా నదికి నీటి విడుదల చేస్తుండటంతో స్థానికుల్లో భయాందోళన మరింత పెరిగింది. ఓవైపు మట్టి కట్ట జారడం..గ్రామాల్లోకి నీటి ఊట పెరగడంతో.. కుమ్మరిగుంట గ్రామాస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రంతా కంటి మీద కునుకులేదని ఆవేదన వ్యక్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నామని చెబుతున్నారు. చేజర్ల, కలువాయి మండలాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: amaravathi farmers padayatra in nellore: ప్రచార రథాలను అడ్డుకున్న పోలీసులు..రోడ్డుపై అమరావతి రైతుల బైఠాయింపు