Gowtham reddy: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు మేకపాటి కృష్ణార్జున రెడ్డి నెల్లూరు జిల్లా సంగం పెన్నానదిలో తండ్రి అస్థికలు నిమజ్జనం చేశారు. శాస్త్రానుసారం క్రతువు నిర్వహించారు. అనంతరం అక్కడికి చేరుకున్న వైకాపా నాయకులకు, కార్యకర్తలకు చేతులెత్తి అభివాదం చేసి..ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. అచ్చం తన తండ్రిలాగే అభివాదం చేయడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. మేకపాటి కృష్ణార్జున రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని పెద్దగా నినాదాలు చేశారు.
గుండెపోటుతో కన్నుమూత..
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ నెల 21 ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలడంతో ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అనంతరం గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు 9.16గంటలకు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
గౌతమ్‌రెడ్డి రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం ఆదివారం(21న) హైదరాబాద్ చేరుకున్నారు.
ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీకి ఆది నుంచి బలమైన మద్దతుదారుగా ఉన్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున ఆయన విజయం సాధించారు.
గౌతమ్‌రెడ్డి తొలిసారిగా 2014లో ఆనం రామనారాయణ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నాయకుడిగా గౌతమ్ రికార్డు సృష్టించారు. 2019లో రెండో పర్యాయం ఆయన బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించి కేబినెట్ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గత నెల 22వ తేదీన మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో స్వల్పలక్షణాలు ఉండటంతో చికిత్స పొంది కోలుకొన్నారు.
గౌతంరెడ్డి పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయం..!
Mekapati Rajamohan Reddy: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వంద ఎకరాల్లో స్థాపించిన రూ.225 కోట్ల విలువైన మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను, అందులోని భవనాలను, ఇతరత్రా ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉదయగిరికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన ఏకాంతంగా సంభాషించారు.
తాము స్వాధీనం చేసే కళాశాలలోనే మేకపాటి గౌతంరెడ్డి పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, గౌతంరెడ్డి ఆశయమైన సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1, ఫేజ్-2 పనులను పూర్తి చేయాలని ఆయన కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
ఇదీ చదవండి :