రెండో పంటలో నెల్లూరు జిల్లా రైతాంగం దాదాపు రూ.700 కోట్లు నష్టపోయారని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులకు..పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర కూడా దక్కనీయకుండా చేశారని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలు జరగలేదంటూ స్థానిక ఎమ్మెల్యే పౌరసరఫరాల శాఖ డేటాను తెదేపా జిల్లా కార్యాలయానికి పంపితే, ఆ జాబితాలో అనికేపల్లికి చెందిన జైపాల్ పేరుతో 57 పుట్ల ధాన్యం విక్రయించినట్టు వెలుగులోకి వచ్చిందని చెప్పారు. జైపాల్ పండించిన 8 పుట్ల ధాన్యాన్ని విధిలేని పరిస్థితుల్లో 10,100 రూపాయల లెక్కన దళారులు మస్తాన్, వెంకటేశ్వర్లుకు అమ్ముకున్నారని సోమిరెడ్డి తెలిపారు. అయితే జైపాల్ పేరుతో 8 లక్షల రూపాయలకు పైగా లావాదేవీలు జరగడంతో ఆయన కలెక్టరేట్లో అధికారులకు ధాన్యం కొనుగోలు అక్రమాలను తెలియజేశారన్నారు.
అధికారులకు చెప్పిన తర్వాత దుర్మార్గంగా జైపాల్‌ను వెంకటాచలం ఎస్సై స్టేషన్‌కు తీసుకెళ్లి, దళారుల ఎదుట విచారణ చేశారని చెప్పారు. విచారణ చేసిన వీడియోను ఎస్సై ఎమ్మెల్యేకు పంపితే, దానిని మీడియాకు విడుదల చేశారని తెలిపారు. జైపాల్ ధాన్యం కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకున్నాడనేందుకు పోలీసులు విడుదల చేసిన వీడియోనే నిదర్శనమన్నారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేశామని ఎస్సై సమక్షంలోనే ఒప్పుకున్న దళారులపై ఏం చర్యలు తీసుకున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు.