ఆక్రమణకు గురవుతున్న అటవీభూములను పట్టించుకునే వారు లేక కబ్జాదారుల పాలైపోతుంది. పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్న అటవీ అధికారుల తీరుతో వందల ఎకరాల్లో అటవీ భూమిని అక్రమించేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఏకంగా రెండు గ్రామాల ప్రజలే ఈ అటవీ భూమిని ఆక్రమించేందుకు పోటీ పడుతున్నారు.
డెక్కలి మండలంలో వెంబులూరు పంచాయితీ పరిధిలో వందలాది ఎకరాల అటవీ భూమి ఉంది. తమ పంచాయితీ పరిధిలో ఉన్నందున మాకే చెందుతాయని మిట్టవడ్డెపాలెం గ్రామస్థులు, తమకే చెందుతాయంటూ సమీపంలో ఉన్న చిన్నకుప్పాయిపాలెం, పెద్దకుప్పాయిపాలెం వాసులు పోటీ పడుతున్నారు. ఈ అటవీభూముల విషయంలో ఇరు గ్రామాలకు మధ్య వివాదంపెరిగింది. 2 రోజులుగా ఆ భూములను ఆక్రమించుకునేందుకు పోటీ పడుతూ, చెట్లను నరికేస్తున్నారు. ఈ సమస్యపై డెక్కలి మండలంలోని అధికారులు.. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్రవహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.