Man Making Various Forms of Chariots in Relangi: సరదాగా తయారు చేసిన ఓ విగ్రహం ఓ వ్యక్తి జీవితాన్ని మలుపుతిప్పింది. అప్పటిదాకా ఆటో నడుపుతూ, వెల్డింగ్ పనులు చేసుకునే ఆయన జీవిత చిత్రాన్ని మార్చేసింది. ఏమీ చదువుకోకపోయినా తనలోని నైపుణ్యానికి కష్టం తోడైంది. దీంతో వెల్డింగ్ పనులు చేసుకునే స్థాయి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవాలకు, పెండ్లి వేడుకలకు వివిధ రూపాలతో కూడిన రథాలను పంపే స్థాయికి ఎదిగారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన బాలకృష్ణ ఆటోడ్రైవర్. పెద్దగా చదువుకోలేదు. ఆటో నడుపుతూనే ఓ చిన్నపాటి వెల్డింగ్ దుకాణాన్ని ప్రారంభించిన బాలకృష్ణ మొదట్లో సరదాగా కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి బొమ్మను తయారు చేశారు. చూసేందుకు అచ్చం గుళ్లో ప్రతిష్టించే దేవుడి విగ్రహంలా ఉండటంతో స్థానికులంతా ఆ బొమ్మ తమకు కావాలని పోటీపడ్డారు. అలా సరదా కోసం చేసిన పని ఆ తర్వాత వ్యాపారంగా మారడంతో అక్కడి నుంచి బాలకృష్ణ వెనుదిరిగి చూసుకోలేదు.
13 ఏళ్లలో 15కుపైగా రథాలు: అప్పటి నుంచి ఏడాదికి ఒకటి రెండు విగ్రహాలు తయారు చేయడం వాటిని ఆటోలు, వ్యాన్లకు అనుగుణంగా మలిచి రూపొందించడం ఇదే పనిగా పెట్టుకున్నారు బాలకృష్ణ. ఇందుకోసం కొత్త ఆటోలు, వ్యాన్లను కొనుగోలు చేసి వాటి బాడీలను తొలగించి తనకు కావాలనుకున్న రీతిలో రథాన్ని తయారు చేస్తారు. తన ఆలోచనకు అనుగుణంగా చిత్రాన్ని గీయించి దానికి సంబంధించిన మౌల్డు చేయించి చివరగా విగ్రహాలు తయారు చేస్తారు. వీటి తయారీలో పూర్తిగా ఫైబర్‌ను వినియోగిస్తారు. 13 ఏళ్లలో దాదాపు 15కుపైగా రథాలను తయారు చేశారు. వీటిని వివాహాది శుభకార్యాలు, పండుగలు, ఉత్సవాల సమయంలో ఊరేగింపుల కోసం ఎక్కువగా వాడుతున్నట్లు బాలకృష్ణ చెబుతున్నారు.
మొదట్లో దేవుడి కోసమని చేశాను. ఆ తరువాత అందరూ అడగటం మొదలు పెట్టారు. ఇంక అప్పటి నుంచి వ్యాపారంగా మొదలయింది. 13 సంవత్సరాలుగా ఒక్కో సంవత్సరం ఒక్కో బండి తయారు చస్తున్నాను. ముందుగా కృష్ణుడికి పెట్టిన తరువాత మిగితా దేవుళ్లకు అద్దెకు ఇస్తాము. వైజాగ్, హైదరాబాద్, ఇంతా చాలా ప్రాంతాలకు మా బండ్లను పంపిస్తాము. నేను పెద్దగా చదువుకోలేదు. ఆలోచనబట్టి తయారు చేస్తున్నాను. నా దగ్గర 20 మంది వరకు పని చేస్తున్నారు.- కిరణ్, వెల్డింగ్ వర్కర్
అలర్ట్ - ముగియనున్న మద్యం షాపుల దరఖాస్తుల గడువు - 1300 కోట్లు దాటిన ఆదాయం
20 మందికి ఉపాధి: రథంలో అమర్చిన దేవతా మూర్తులను బట్టి వీటిని అద్దెకు తిప్పుతుంటారు. వీటికున్న డిమాండ్ దృష్ట్యా రథానికి రోజుకు 15 నుంచి 20 వేల రూపాయల వరకూ వసూలు చేస్తారు. పక్క రాష్ట్రాలకు చెందిన వారూ బాలకృష్ణ వద్దకు వచ్చి వీటిని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వద్ద ఉన్న వాటిలో ఎద్దులబండి, కనకదుర్గమ్మ, వెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణులు, ముత్తైదువులు, హంసను పోలిన రథాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
తన కృషి, పట్టుదల, నైపుణ్యంతో వెల్డింగ్ చేసే స్థాయి నుంచి ఎంతో డిమాండ్ ఉన్న రథాల తయారీ వరకు ఎదిగిన ఆయన తనకు అన్నం పెట్టిన వెల్డింగ్ వృత్తిని ఇప్పటికీ వదిలిపెట్టకుండా కొనసాగిస్తూ వస్తున్నారు. తాను పని చేయడమే కాకుండా ప్రస్తుతం 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
పాలనలో వేగం పెంచనున్న ప్రభుత్వం - ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై కీలక నిర్ణయం
కడియపు లంక నర్సరీలోని ఈ మొక్కపై రతన్ టాటాకు ఆసక్తి - స్వయంగా కలిసిన రైతులు