కేదార్నాథ్ క్షేత్రంలో ఆది శంకరాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగా శ్రీశైలంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. శ్రీశైల క్షేత్రానికి సమీపంలోని పాలధార - పంచదార వద్ద జగద్గురు ఆదిశంకరాచార్యుల మూర్తికి విశేష పూజలు జరిగాయి. ఏడవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి పాలధార - పంచధార వద్ద తపస్సు చేశారు. అక్కడే ఆయన శివానందలహరి, సౌందర్య లహరి అనే ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని పాలధార - పంచధార వద్ద శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్యుల విగ్రహ మూర్తికి అర్చకులు వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయం దక్షిణ మాడ వీధి వేదికపై ఆది శంకరాచార్యుల చిత్రపటానికి దేవస్థానం ఈవో ఎస్.లవన్న, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పూజలు నిర్వహించారు. తదుపరి కేదార్నాథ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కార్యక్రమాలను ఎల్ఈడి టీవీ తెర ద్వారా అధికారులు, భక్తులు ,స్థానికులు వీక్షించారు.
విజయవాడలో....
విజయవాడలో దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం గం.4.30ని. వరకు ఆదిశంకరాచార్యుల మూర్తికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇదీ చదవండి : పంట పొలాల్లో చిరుత పులులు...రైతులు ఏం చేశారంటే..