ప్రజలకు సేవలు అందించడంలో తపాలా శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. 12 సంవత్సరాలకోసారి వచ్చే గోదావరి, కృష్ణా, గంగ, యమునా నదుల పుష్కరాలకు దేశవ్యాప్తంగా ఉండే ప్రజలకు పుష్కర జలం అందించి వారి మన్ననలు పొందింది. ప్రతి పుష్కర కాలంలో లీటరు నీరు కేవలం రూ.30లకే సరఫరా చేసింది. ఈనెల 20 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్నాయి. ఇక్కడికి రాలేని వారికి తపాలా శాఖ తుంగభద్ర పుష్కర జలం సరఫరాకు మంగళం పాడింది. కరోనా నేపథ్యంలో పుష్కర నీరు పంపిణీ చేయడానికి ఆసక్తి చూపలేదు. పని ఒత్తిడి కారణంగా పుష్కర నీళ్లు సరఫరా చేయలేమని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం ప్యాకింగ్ చేస్తే.. పుష్కర నీళ్లు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కర్నూలు డివిజన్ తపాలా శాఖ ప్రధాన పర్యవేక్షకులు హరికృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు.
కొవిడ్ భయం.. భయం
పుష్కరాల్లో విధులు నిర్వహించే అధికారులకు కొవిడ్ భయం పట్టుకుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారిలో ఎవరైనా కొవిడ్ లక్షణాలున్న వారుంటారేమో? అన్న ఆలోచనలతో సతమతమవుతున్నారు. కొన్ని శాఖలు విధులు నిర్వహించే వారికి అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తున్నా చేతులు మారి వచ్చే సరికి ఎక్కడ వైరస్ బారిన పడతామోనన్న భయంతో ఉన్నారు. విధులు షిఫ్టుల ప్రకారం కనుక కొందరు ఇంటికి వెళ్లి భోజనాలు తినేలా ప్రణాళిక వేసుకుంటున్నారు.
ఇదీ చదవండి: మంత్రాలయంలో ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు